వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎంపీలు ఎవరూ లేరు. ఉన్న ఐదుగురు ఎంపీలు.. తమ పదవులకు చాలా కాలం క్రితమే రాజీనామా చేశారు. కానీ.. వారు… పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయన్న సమాచారం రాగానే ఢిల్లీలో వాలిపోతారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం రోజు నుంచి చివరి రోజు వరకు.. వాళ్లు మీడియాలో కనిపిస్తారు. సాక్షి మీడియాలో గంట గంటకు కనిపిస్తారు. ఇతర మీడియా వాళ్లు ఉత్సాహపడితే… కెమెరాకు ప్లకార్డులు చూపించి నినాదాలు చేస్తారు. వైసీపీ మాజీ ఎంపీల తీరును చూసి… స్పీకర్‌తో పాటు… ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు నవ్వుకోవాల్సి వస్తోంది. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చెయ్యాలి..? ఎందుకు పార్లమెంట్ గేటు బయట నిలబడాలనేది..ఇతర రాష్ట్రాల ఎంపీలకు అర్థం కావడం లేదు. ప్రతీ రోజూ.. టీడీపీ ఎంపీలు.. గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పార్లమెంట్ లోపల నిరనస వ్యక్తం చేస్తూ ఉంటారు. కీలకమైన బిల్లులు ఉన్నప్పుడు… తమ వాదన వినిపించడానికి ప్రయత్నిస్తూంటారు. కానీ.. వైసీపీ మాజీ ఎంపీలకు మాత్రం.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వారు.. గాంధీ విగ్రహం దగ్గర నిలబడటానికి కూడా అవకాశం లేకపోయింది. అందుకే.. పార్లమెంట్ బయట.. సాక్షి మీడియాతో మాట్లాడి.. ఏదో పోరాటం చేశామని కవరింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిద్దరూ… రాజ్యసభలో ఒక్క మాటంటే.. ఒక్క మాట మాట్లాడరు. ఏదైనా ప్రశ్న వేస్తే.. అంతా ఏపీలో.. ఎంత నెగిటివ్ ఉందో.. చెప్పడానికి సాంకేతిక అంశాలు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూంటారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు. విభజన సమస్యలపైనా ప్రస్తావించరు.
ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి.. పార్లమెంట్ జరిగినప్పుడల్లా.. ఎందుకు లోక్ సభ ముందు డ్రామాలెయ్యాలనేది సామాన్యులకు కూడా వస్తున్న సందేహం. అదే… ఎంపీ పదవులకు రాజీనామాలు చేయకుండా ఉండి ఉంటే.. బాగుండేదికదా.. అనేది సామాన్యులకు వస్తున్న సందేహం. ఒక వేళ రాజీనామాలు చేసి ఉంటే.. అదేదో… ఏపీలోనే పోరాటం చేస్తే.. కాస్త పొలిటికల్ మైలేజీ అయినా వచ్చి ఉండేది కదా… అని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల ఆరాటం. ఢిల్లీలో పార్లమెంట్ ముందు పదే పదే కనిపిస్తూ… రాజీనామాలు చేసి ఏం సాధించారనే సందేహం అందరికీ వచ్చేలా చేస్తున్నారు.