సంక్రాంతి వెళ్లిన తర్వాత వంద మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇది ఓ రకంగా ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం లాంటిదే. ఎందుకంటే… చంద్రబాబుకు… చివరి నిమిషం వరకూ టిక్కెట్లను ఖరారు చేసే అలవాటు లేదు. చివరికి తన టిక్కెట్‌ను కూడా తాను చివరికి జాబితాలో ప్రకటించుకునే టైప్. అలాంటి మైండ్ సెట్ ఉన్న నేత.. మూడు నెలల ముందుగానే టిక్కెట్ల జాబితా ప్రకటిస్తారంటే.. ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే.. తెలంగాణలో ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించి.. కేసీఆర్ లాభపడిన విధానం చూస్తే.. చంద్రబాబు కూడా టెంప్ట్ అవుతారని.. కనీసం ఓ వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.
మరి చంద్రబాబు.. అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. అసలు వెనుకబడ్డామని ఆలోచనే… రాకుండా చేయడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇక అభ్యర్థుల విషయంలో ఊరుకుంటారా..? అందుకే ఆయన బహిరంగ ప్రకటనలేమీ చేయకుండానే.. అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర జనవరి ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన ముగియనుంది. ముగింపు సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. పైలాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సభలోనే ఆయన ఉరుము లేని పిడుగులాగా… ఓ 120 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారంటున్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలు.. సామాజిక సమీకరణాలు చూసుకుని ఇప్పటికే జాబితా రెడీ చేశారని అంటున్నారు.
ఇటీవలి కాలంలో..జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా.. చాలా మందిని ఇన్చార్జులుగా తప్పించారు. వీరిలో అత్యంత నమ్మకస్తులైన వారు ఉన్నారు. వారెవరికీ.. చివరి నిమిషంలో కూడా టిక్కెట్లు ఇవ్వడం లేదని.. కొత్తగా సమన్వయకర్తలుగా నియమించిన వారికే టిక్కెట్లు ప్రకటించబోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే.. ఉండేవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారన్నట్లుగా జగన్ ఆలోచన ఉందట. మొత్తానికి.. చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపికపై లీకులిస్తున్నారేమోనీ.. జగన్ అలాంటిదేమీ లేకుండానే.. జాబితాలో రిలీజ్ చేయబోతున్నారన్న చర్చ మాత్రం జోరుగానే నడుస్తోంది.