జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు … చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ.. ఆంధ్రజ్యోతి ఆర్కే లాంటి జగమెరిగిన జర్నలిస్టుకు మాత్రం… అందులో ఉన్న లోతైన రాజకీయం ఏమిటో కూడా… తెలిసిపోతోంది. ఈ వారం కొత్త పలుకు ఆర్టికల్లో చాలా వరకూ.. కేసీఆర్ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… టీఆర్ఎస్ ఎందుకు బాహాటంగా మద్దతు పలుకుతోంది..?. దానికి కారణం… ” ఏపీలో చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే జాతీయ రాజకీయాలలో కూడా తనదే పైచేయి అవుతుందన్నది కేసీఆర్ నమ్మం”. టీఆర్ఎస్ తెలంగాణలో పదహారు సీట్లు గెల్చుకుని… ఏపీలో జగన్మోహన్రెడ్డి 15 లోక్సభ స్థానాల వరకు గెలుచుకోగలిగితే ఇరువురికీ కలిపి 30 మంది ఎంపీల బలం ఉంటుంది కనుక సార్వత్రిక ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఈ 30 మంది మద్దతు కీలకం అవుతుందన్నది కేసీఆర్ ఆలోచనట. జగన్.. కేసీఆర్ ఏది చెబితే అది చేస్తారా.. అంటే… చేయక తప్పదన్నట్లుగా ఉంటుంది మరి వ్యవహారం.
తనతో ఫెడరల్ ఫ్రంట్లో ఇతర పార్టీలు వస్తాయని.. కేసీఆర్ నమ్మడం లేదు. ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా జగన్ కోసమేనని అంటున్నారు. ఎవరు చేతులు కలిపినా, కలపకపోయినా కొత్త మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి ఏపీలో మెజారిటీ ఎంపీలను గెలుచుకుంటే కేంద్రంలో తాను కీలకపాత్ర పోషించవచ్చుననీ, అదే జరిగితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కుమారుడైన కేటీఆర్కు కట్టబెట్టి.. తాను ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారట. కేటీఆర్ కూడా తాను త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కేంద్రంలో కేసీఆర్కు కీలక పాత్ర పోషించే అవకాశం రాకపోతే.. ఆయనే సీఎంగా ఉంటారట.
జాతీయ రాజకీయాలలో తనకు పోటీగా ఉండే అవకాశం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్గా చేసుకున్నారని ఆర్కే తేల్చారు. అఖిలేశ్, మాయావతి, నవీన్ పట్నాయక్ మినహా మిగతా బీజేపీ పార్టీ వ్యతిరేక శక్తులన్నింటినీ కాంగ్రెస్తో కలిసి ఒకే వేదికను పంచుకునేలా చంద్రబాబు చేయగలిగారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి చక్రం తిప్పలేరని ఆర్కే తేల్చేశారు. అందుకే.. చంద్రబాబును.. మరింతగా ఇబ్బంది పెట్టి ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డికి భారీగా ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆర్కే చెబుతున్నారు. జగన్ గెలవడానికి తన వంతు ప్రయత్నం చేస్తే… చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా వర్తమాన రాజకీయాలలో తెలుగునాట తనదే పైచేయి అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్కే చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కానీ మ్యాజిక్ జరుగుతుందా..అనేదే సందేహం.