‘ఎన్టీఆర్’- ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. శనివారం సెన్సార్ జరగాల్సింది. కానీ సెన్సార్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడింది. సోమ, మంగళవారాల్లో సెన్సార్ పూర్తవుతుంది. అయితే..’మహానాయకుడు’ కి సంబంధించిన షూటింగ్ ఇంకాస్త మిగిలే ఉందని సమాచారం. మరో 7 రోజులు షూటింగ్ పార్ట్ బాకీ ఉందని తెలుస్తోంది. జనవరి 9 వరకూ పార్ట్ 1 హడావుడే ఉంటుంది. ఆ తరవాత సంక్రాంతి సెలవలు వచ్చేస్తాయి. అవి ముగిశాకే… పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుంది. నిజానికి జనవరి 24నే పార్ట్ 2 కూడా విడుదల చేద్దామనుకున్నారు. ఆ డేట్ ఫిక్సయి ఉంటే మరింత కష్టమయ్యేది. ఎలాగూ ఫిబ్రవరిలో విడుదల కాబట్టి.. ఆ ఏడు రోజుల షూటింగ్ సమస్యగా మారకపోవచ్చు. ఇప్పటికే ‘కథానాయకుడు’ కోసం ప్రచారం మొదలైపోయింది. మీడియా ఇంటర్వ్యూల కార్యక్రమానికి చిత్రబృందం శ్రీకారం చుట్టింది. విద్యాబాలన్‌ని కూడా ప్రమోషన్లకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే.. విద్య బిజీ షెడ్యూల్ వల్ల అది కుదరకపోవొచ్చని సమాచారం. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆడియో ఫంక్షన్‌కి విద్య రాగలిగింది. మీడియా ఇంటర్వ్యూలకు మాత్రం తను అందుబాటులో ఉండదు.