ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్విట్టర్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. విషయం అదే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడమే! కుట్ర పూరితమైన కూటములు కడుతూ… కొత్త మిత్రుల కోసం వెతుకులాటలోనే చంద్రబాబు బిజీగా ఉన్నారనీ, రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారని జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన తీరిక లేకుండా గడిపారనీ, అలాంటి ఆయనకి తాము చేసిన ఉద్యమాలు కనిపించవన్నారు. ప్రజల తరఫున నిరంతరం చేస్తున్న పోరాటాలు ప్రజలకు సుపరిచితమైనవే అన్నారు. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ ట్వీట్ చేశారు.
కుట్ర పూరిత కూటముల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు కదా! ఇంతకీ కుట్ర ఎవరిది..? ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తూ… ఏపీ రాజకీయాలకు వస్తామంటే, తగుదునమ్మా అంటూ వారికి మద్దతు పలుకుతూ ఆహ్వానాలు పలుకుతున్నది ఎవరు..? కుట్రపూరిత కూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? ఇంకోపక్క, కేంద్రం అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నా.. ఒక్కటంటే ఒక్క రోజు కూడా ప్రధానిని విమర్శించలేని పరిస్థితిని ఏమంటారు… కుట్రపూరిత కూటమి ప్రయత్నమా కదా..? ఇక, చంద్రబాబు విషయానికొస్తే… కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి నుంచి బయటకి వచ్చారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మాటిస్తే… రాజకీయంగా టీడీపీకి అత్యంత సాహసమైనా, ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డారు. దీన్లో జగన్ కు కనిపించిన కుట్ర కోణమేంటో ఆయనే చెప్పాలి.
తాము చేసిన ఉద్యమాలు ప్రజలకు సుపరిచితమని జగన్ అన్నారు కదా! కరెక్టే, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా చేసిన ఉద్యమాలు మాత్రమే ప్రజలకు తెలుసు. అవి సాధించిన ఫలితాలు ఏంటో తెలుసు, ఈ ఉద్యమాల్లో భాగంగా కేంద్రాన్ని వైకాపా నిలదీసిన సందర్భాలేవో కూడా తెలుసు! నిరంతరం పోరాటం అంటున్నారు కదా.. ఇంతకీ ఆ పోరాటం ఎక్కడుంది..? ఎంపీల రాజీనామాలు ఏం సాధించాయి..? వంచనపై దీక్షల వల్ల ఏ ఫలితాలు వచ్చాయి..? టీడీపీ పాలనను ప్రశ్నిస్తూ.. తమ పోరాటాలే గొప్పవి అన్నట్టుగా జగన్ చెప్పుకుంటున్నారు. కానీ, ఓపక్క రాష్ట్రంలో పరిపాలన చేస్తూ, కేంద్రంతో పోరాటం చేయడం అంటే ఏంటో ఆ పార్టీకి అర్థం కాని విషయం, అనుభవంలో లేని అంశం. జగన్ చెబుతున్నట్టుగానే… ప్రజలు అన్నీ చూస్తున్నారు. వైకాపా చేస్తున్న అధికారం కోసం పోరాటాలకీ, కేంద్రం సహకరించకున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా… సంక్షేమాన్నీ అభివృద్ధినీ సాధించే దిశగా ప్రభుత్వం పడుతున్న ప్రయాసనీ గమనిస్తున్నారు.