2018 వెళ్తూ వెళ్తూ కొన్ని విజయాల్ని, కొన్ని చేదు జ్ఞాపకాల్నీ ఇచ్చి వెళ్లింది. అన్నింటికంటే కొన్ని కీలక పాఠాల్ని నేర్పి వెళ్లింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకు. 2018 పోగ్రెస్కార్డు…మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టింది. కోట్లు ధారబోసిన సినిమాలైనా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సున్నితమైన కథలతో వస్తే… ఆదరిస్తున్నారు. వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగాలు చేసినా ఆదరిస్తామని హామీ ఇస్తున్నారు.
రంగస్థలం, భరత్ అనే నేను లాంటి చిత్రాలు కమర్షియల్ కథానాయకులకు పాఠాలుగా మారిపోతాయి. రంగస్థలం మామూలు రివైంజ్ డ్రామానే. కానీ.. దాన్ని ఓ కొత్త నేపథ్యంలో చూపించడం ప్రేక్షకులకు నచ్చింది. హీరో అంటే ధీరోధాత్తుడే కానక్కర్లేదని, లోపాలున్న మనిషిగా చూపించినా ఇమేజ్‌కి ఏమాత్రం భంగం కలగదని రంగస్థలం నిరూపించింది. ఈ తరహా ప్రయోగాలు మరిన్ని చేయడానికి ఈ సినిమా ఊతం వచ్చింది. భరత్ అనే నేను కూడా అంతే. క్లాసీగా కనిపించిన మాస్సినిమా ఇది. పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాలకు రోజులు పోయాయన్న మాటలకు ఈ సినిమా వంద కోట్లతో బదులు చెప్పింది.
కథలో వైవిధ్యం లేకపోయినా ఫర్వాలేదు.. కథనం బాగుంటే చాలు అని చెప్పడానికి ‘గీత గోవిందం’ ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమాలో కథే లేదు. కానీ.. కథనం, కథానాయకుడి పాత్ర చిత్రణ.. హీరో, హీరోయిన్ల మధ్య కనిపించిన కెమిస్ట్రీ.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. చిన్న సినిమాల్లోనే పెద్ద విజయాన్ని కట్టబెట్టాయి. బయోపిక్ ఎలా తీయాలో చెప్పడానికి ‘మహానటి’ ఓ పాఠంగా మారింది. ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ 2018లో కొన్ని సినిమాల్లో కనిపించింది. అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోని కథానాయకుడి పాత్ర పూర్తిగా ఎగ్రెసివ్‌గా ఉంటుంది. ‘కిరాక్ పార్టీ’లో నిఖిల్ కూడా అంతే. అయితే తెలుగు ప్రేక్షకులు చూసిందే చూడ్డానికి ఇష్టపడరు. అందుకే ఈ సినిమాల్ని తిప్పి కొట్టారు. ఓ పాత్రనో, కథనో చూసి స్ఫూర్తి పొందాలి గానీ, దాన్ని అనుకరించకూడదని చెప్పిన పరాజయాలివి. రొడ్డకొట్టుడు మాస్ డ్రామాలు చూడరన్న విషయం ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’ నిరూపించాయి. మేం కొత్త కథ తీశాం.. ఇదో ప్రయోగం అనుకుని ప్రేక్షకులతో ఆడుకుంటే ఏం జరుగుతుందో ‘మను’, ‘వీర భోగ వసంతరాయులు’ ఫలితాలు తేల్చి చెప్పేశాయి.
ఇవన్నీ 2019లో దర్శక నిర్మాతలకు, కథానాయకులకు పాఠాలే. ఈ అనుభవాల నుంచి ఎవరెంత నేర్చుకుంటారన్నది కీలకం. 2019 లో కొత్త తప్పులు చేసినా ఫర్వాలేదు, పాత తప్పులు రిపీట్ చేయకుండా ఉంటే అదే పది వేలు.