అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే జి.గుర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ జగన్ కు అత్యత సన్నిహితంగా వ్యవహరించిన గుర్నాథ్ రెడ్డి… గత ఏడాది తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనను పట్టించుకోవడం లేదు. అనంతపురంలో బలమైన అనుచరగణం ఉన్న ఆయన… జేసీ దివాకర్ రెడ్డి సాయంతో.. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక్క జేసీ మినహా.. మిగతా టీడీపీ నేతలందరూ… గుర్నాథ్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ.. జేసీ దివాకర్ రెడ్డి మాత్రం… గుర్నాథ్ రెడ్డి సీటు అడగడం లేదని… చెప్పి పార్టీలో చేర్పించారు. అయితే ఏ పదవి మాత్రం ఇప్పించాలనుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం… గుర్నాథ్ రెడ్డి పదవి విషయంలో ఎటూ తేల్చలేదు. కొద్ది రోజుల కిందట.. తెలుగుదేశం పార్టీ.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు… జేసీ దివాకర్ రెడ్డి అలక పాన్పు ఎక్కారు. అప్పుడు ఆయన హైకమాండ్ ముందు ఉంచిన డిమాండ్లలో గుర్నాథరెడ్డికి పదవి ఇవ్వడం కూడా ఒకటని ప్రచారం జరిగింది. అప్పట్లో.. చంద్రబాబు ఏం హామీ ఇచ్చారో కానీ… ఆయన అలక వీడారు కానీ.. గుర్నాథ్ రెడ్డికి మాత్రం… పదవి రాలేదు. గుర్నాథ్ రెడ్డి చేరిన… ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ఆయనను కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు. దానికి కారణం.. వీరిద్దరికి జేసీతో పడకపోవడమే. ఈ విబేధాలు తీవ్రమవడంతో.. గుర్నాథ్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.
గుర్నాథ్ రెడ్డి.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే.. ఆయన జగన్పై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేరు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. గుర్నాధ్ రెడ్డికి ఉన్న మరో ఆప్షన్ జనసేన మాత్రమే. ఆయితే ఆయన ఏ విషయాన్ని ప్రకటించలేదు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. టీడీపీకి అయితే రాజీనామా చేశారు.