“హ్యాపీ న్యూ ఇయర్” అని ఆంధ్రప్రదేశ్లో ఆరంభఘడియల్లోనే చెప్పుకోగలరు. తెల్లవారిన దగ్గర్నుంచి రాజకీయ పోరాటమే. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తాల్సిందే. ఎందుకంటే… ఎన్నికలు…చావో రేవో అన్నట్లుగా.. పార్టీలు.. ఆ పార్టీలకు చెందిన నేతలు తల పడుతున్న సమరం.., ఇప్పటికే ప్రారంభమయింది. తెర వెనుక వ్యూహాలు.. తెర ముందు పొత్తులు.. ఇలా కొత్త ఏడాది తొలి ఆరు నెలలు అత్యంత ఉద్రిక్తంగా.. రాజకీయం ఉండబోతోంది.
అందరి లక్ష్యం చంద్రబాబును ఓడించడమే..!
సహజంగానే.. 2019 ఎన్నికల ఏడాది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మంగా.. ముందే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఏపీలో మాత్రం జమిలీ ఎన్నికలు ఖాయమే. ఫిబ్రవరిలోనే.. ఎన్నికల నోటిఫికేషన్ ఖాయమని ఢిల్లీ నుంచి సూచనలు వస్తూండటంతో రాజకీయ పరిణామాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరు.. ఎవరెవరితో తలపడబోతున్నారో దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబునాయుడు టార్గెట్ గా.. రకరకాల పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ప్రధానప్రతిపక్షంగా జగన్ కన్నా… బయట నుంచి తెలుగుదేశం పార్టీపై చేస్తున్న రాజకీయ పోరాటమే ఎక్కువగా ఉంది. ఢిల్లీ నుంచి బీజేపీ, తెలంగాణ నుంచి కేసీఆర్.. చంద్రబాబును టార్గెట్ చేశారు. మరో సారి తెలుగుశం పార్టీని గెలవనీయబోమని… చంద్రబాబును ఓడించి తీరుతామని… రామ్ మాధవ్ లాంటి అగ్రనేతలు.. చాలా కాలంగా సవాళ్లు చేస్తున్నారు. అంతర్గతంగా తెర వెనుక ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జత కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసినందుకు గాను.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఓడిస్తామని సవాల్ చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ప్రారంభమయిందని.. వైసీపీ ఫండ్స్ అందుకుంటోందని.. చంద్రబాబు ప్రకటించేశారు కూడా..!
ఎవర్ని గెలిపించాలని టీఆర్ఎస్, బీజేపీ కంకణం కట్టుకున్నాయి..?
చంద్రబాబును ఓడించి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తున్న బీజేపీ కానీ.. టీఆర్ఎస్ కానీ .. ఏపీలో అధికారంలోకి రాలేవు. కాబట్టి.. ఆ పార్టీల లక్ష్యం చంద్రబాబును ఓడించడమే. .. అంటే.. చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్న వారిని గెలిపించడం. ఆ ప్రత్యర్థి ఎవరు..? అంటే.. అందరికి జగన్మోహన్ రెడ్డినే గుర్తుకొస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. తాను ప్రత్యామ్నాయం అని.. అటు బీజేపీకి.. ఇటు టీఆర్ఎస్ కు నమ్మకం కలిగించలేకపోయారు. అదే సమయంలో… చంద్రబాబును ఓడించడానికి పవన్, జగన్ లను కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అంటే.. ఇప్పుడు ఏపీలో అధికారానికి పోటీ పడుతూ.. చంద్రబాబును ఓడించడానికి. ఎదురుగా.. జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నప్పటికీ.. వెనుకగా ఓ కూటమి ఉంది. భారతీయ జనతా పార్టీ అలాగే.. టీఆర్ఎస్ … కూడా ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. పవన్ కల్యాణ్ కూడా వారి బాటలోనే నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది..
లోపాయికారీ స్నేహాలతో ఏపీలో రాజకీయం మార్చేయగలరా..?
అయితే.. ఏపీ రాజకీయంలో ఉన్న విచిత్రం ఏమిటంటే.. ఎవరూ నేరుగా.. ఒకరికొకరు సహకరించుకున్నట్లుగా కానీ.. కూటమి కట్టినట్లుగా కానీ ఉండరు. అందరి లక్ష్యం.. చంద్రబాబునాయుడ్ని ఓడించడమే… అయినప్పటికీ.. ఒకరితో ఒకరు కలిస్తే.. రాజకీయ సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉంది. బీజేపీతో కలిసేందుకు వైసీపీ ముందుకు రాదు. టీఆర్ఎస్ మద్దతును బహిరంగంగా తీసుకునేదుకు కూడా… వైసీపీ ముందుకు రాకపోవచ్చు. ప్రత్యేకహోదా కోసం లేఖ రాస్తానంటూ.. కేసీఆర్ చేసిన ప్రకటనపై వైసీపీ చాలా పాజిటివ్ గానే పందిస్తోంది. బహుశా… మద్దతు తీసుకునే ప్రయత్నం చేయవచ్చనే అంచనాలున్నాయి. ఏదైనా.. అందరూ చంద్రబాబుకు వ్యతిరేకమే. వెనుక కలసి పనిచేస్తారు. ప్రజల ముందు మాత్రం విడిగా ఉంటారు. అన్ని శక్తులు ఒక్కటై వస్తూంటే.. చంద్రబాబు ఒంటరిగానే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. అది బలం కన్నా.. బలహీనతగా మారే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతాం కానీ.. ఏపీలో మాత్రం కలిసే చాన్స్ లేదు.