భారత ప్రధాని నరేంద్రమోడి ఎక్కువుగా “ఫ్లయింగ్ మోడ్”లో ఉంటారని ఆయన విదేశీ పర్యటనల గురించి సోషల్ మీడియాలో జోకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరో సారి ఆయన ఈ “ఫ్లయింగ్ మోడ్”లోకి వెళ్లబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. వెళ్లిపోయారు. అయితే.. ఈ సారి ఆయన విదేశాల్లో కాదు.. భారత్‌నే చుట్టబెట్టబోతున్నారు. గత నెల 24న ఒడిషా నుంచి ఈ పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో రెండో సారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ… ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్దం చేశారు. వంద రోజుల్లో ఇరవై రాష్ట్రాలను .. ఆయా రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలన్నింటినీ కవర్ చేయాలని నిర్ణయించుకున్నారు.
డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒడిశా, అసోంలలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనవరి 4న మోదీ మరోసారి అసోంలో పర్యటించనున్నారు. ఐదో తేదిన ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి ఓటమిపాలైన 123 నియోజకవర్గాలపై పార్టీ ఈసారి ప్రత్యేక దృష్టిపెట్టింది. మిషన్ 123 పేరుతో 123 నియోజకవర్గాలను 25 క్లస్టర్లుగా విభజించి.. ఒక్కో క్లస్టర్ బాధ్యతలను ఒక్కో నాయకుడికి అప్పజెప్పింది. వీటన్నిటంిలోనూ మోడీ ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
బీజేపీకి, మోడీకి ఉన్న అడ్వాంటేజ్.. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది.. ఏ ఏ విడతల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే అంశం… ఈసీని పరోక్షంగా హ్యాండిల్ చేయడం ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇది కేసీఆర్‌కు కూడా ఉపయోగపడింది. ఆయన.. ఎన్నికల షెడ్యూల్‌తో సహా మొత్తం రెడీ చేసుకుని… అసెంబ్లీని రద్దు చేసేశారు. యాభై రోజుల్లో వంద సభలంటూ.. ప్రచారం ఉద్ధృతంగా నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను రేసులోకి రాకుండా.. తాను సగం దూరం వెళ్లిపోయారు. అంతిమంగా ఘన విజయం సాధించారు. ఇప్పుడు మోడీ కూడా అలాంటి ప్లాన్‌లోనే ఉన్నారనుకోవాలి.