తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రాజెక్టుల బాట పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పనితీరును సమీక్షించేందుకు ఆయన హెలీకాప్టర్ లో వెళ్లారు. సుందిళ్లు, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను కూడా ఈరోజే పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. ఈ రాత్రికి ముఖ్యమంత్రి అక్కడే బస చేసే అవకాశం ఉంది. రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనులను చూసేందుకు బయల్దేరుతారు. అనంతరం మరికొన్ని పంపుహౌస్ లు, బ్యారేజీలను కూడా కేసీఆర్ పరిశీలించబోతున్నారు.
ఛీఫ్ ఇంజినీరు శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కాళేశ్వరం పరిధిలోని కొన్ని ప్రాజెక్టలు, పంప్ హౌస్ ల నిర్మాణ పనులను పరిశీలించారు. వీటిపై ఒక సమగ్ర వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. దీని తరువాత, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కూడా పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమగ్ర నివేదికను ఇస్తారని సమాచారం. ఇక మూడు రోజులపాటు వివిధ ప్రాజెక్టులను పరిశీలించిన రిటైర్డ్ ఇంజినీర్ల బృందం రేపు సాయంత్రానికే ముఖ్యమంత్రికి సమగ్ర వివరాలు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనితీరు పరిశీలన అనంతరం కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటారు. ఈనెల 3 లేదా 4న రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్రంగా సమీక్షిస్తారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమీక్షపై ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు మరింత వేగవంతమైన చర్యలు ఏవి తీసుకోవాలనేదీ చర్చిస్తారని అధికారులు అంటున్నారు.
నిజానికి, రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పనితీరుపై మాజీ మంత్రి హరీష్ రావుకి చాలా అవగాహన ఉంది. కానీ, కేసీఆర్ తాజా పర్యటనలో ఆయన ఉండే అవకాశాల్లేవు కదా! అలాగే, ప్రాజెక్టులపై మూడు, నాలుగో తేదీల్లో జరిగే సమగ్ర సమీక్షల్లో కూడా ఆయన పాల్గొనే ఛాన్స్ లేదు. ఎందుకంటే, మంత్రి వర్గ ఏర్పాటు ఇంకా జరగలేదు కదా. అలాగని, గతంలో పనిచేశారు కదా అంటూ హరీష్ రావుని ఈ సమావేశానికి పిలిచే అవకాశాలూ ఉండవు. మొత్తానికి, తన ప్రాధాన్యతాంశంలో ఒకటైన ప్రాజెక్టుల పనితీరుపై ముఖ్యమంత్రే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర సమీక్ష నిర్వహణకు వెళ్తుండటం విశేషం. ఇంత కీలకమైన నీటి పారుదల శాఖకైనా ఒక మంత్రిని నియమించేసి ఉంటే… ఈ పనులన్నీ మంత్రి చూసుకునేవారు కదా