పవన్ కల్యాణ్ విషయంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత దృక్పథం క్రమంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో.. బీజేపీతో జగన్, పవన్ కలసి పని చేస్తున్నారని ఆరోపించే ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో… పవన్ ను డ్రాప్ చేశారు. ఆ ప్లేస్ లోకి కేసీఆర్ ను చేర్చారు. కేసీఆర్, జగన్, మోడీ కలిసి.. ఏపీలో రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో మార్పులొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పదో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. ఆ సమయంలో జనసేన, టీడీపీ కలుస్తాయని.. బయట ప్రచారం జరుగుతోందని.. ఓ విలేకరి ప్రశ్నకు.. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనని చంద్రబాబు తోసి పుచ్చారు. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్.. తనను అదే పనిగా ప్రతీ చోటా విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. చాలా కాలం పాటు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయలేదని.. మళ్లీ ఇటీవలి కాలం నుంచే విమర్శలు గుప్పిస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీకి, జనసేనకు లింక్ పెట్టి ఆయన శ్రీకాకుళంలో విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్టులు ప్రస్తావించినప్పుడు.. ఆయనకు నొప్పేంటని ప్రశ్నించారు. జనేసన పోటీ చేస్తానంటే.. జగన్ ఎందుకు భయటపడుతున్నారన్నారు.
శరవేగంగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో.. కీలక పరిణామాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్, మోదీ, జగన్ చంద్రబాబును ఓడించాలని పట్టుదలగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా.. పదే పదే తాను గెలవలేకపోవచ్చు కానీ… చంద్రబాబును ఓడిస్తానంటూ అదే పనిగా సవాల్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన పరిణామం ఏమిటంటే… చంద్రబాబు .. మోడీ, జగన్, కేసీఆర్ ల నుంచి పవన్ ను విడదీశారు. జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. క్రిస్మస్ సెలవుల తర్వాత పవన్ కల్యాణ్ జనవరి ఒకటో తేదీనే ఫీల్డులోకి వచ్చారు. తొలి రోజు ఎన్నికలకు సిద్ధమవుతామని ప్రకటించారు కానీ.. ఎవరిపైనా విమర్శలు చేయలేదు. ముందు ముందు ఆయన మాటల తీరును బట్టి.. రాజకీయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.