విభజన తరువాత, అరకొర నిధులతో, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటూ… గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం పనితీరు వరుసగా పది శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మొత్తం పది రకాల అంశాలను తీసుకుని ప్రజల ముందు వాస్తవ పరిస్థితులను ఉంచారు. విభజన తరువాత ఎలాంటి పాలనను అందించాం, ఏయే అంశాల్లో అనుకున్న లక్ష్యాలు సాధించాం, ఏయే అంశాల్లో సాధించలేపోయాం.. వాటికి గల కారణాలేంటనేవి ఈ శ్వేత పత్రాల ద్వారా ప్రజల ముందుంచే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు. ఈ పది పత్రాల గురించి ఓవరాల్ గా చెప్పాలంటే… కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామనీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీపడకుండా.. సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగామనేదే సారాంశం.
ఈ పది శ్వేత పత్రాలను క్షేత్రస్థాయిలో వివరించేందుకు జనవరి 2 నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో చర్చిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వీటిపై ప్రజలే చర్చిస్తారనీ, అన్నింటిపైనా ప్రజలే సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు. అంటే… ఎన్నికలు ముందు జరుగుతున్న ఈసారి జన్మభూమి కార్యక్రమ నిర్వాహకులపై పెద్ద బాధ్యతే ఉన్నట్టు లెక్క. ప్రతీగ్రామంలో ఈ శ్వేత పత్రాలపై చర్చ పెడతామని పార్టీ అంటోంది. నిజానికి, ముఖ్యమంత్రే స్వయంగా శ్వేత పత్రాలను విడుదల చేస్తూ… వాటిలోని అంశాలను వివరించిన చేసిన సంగతి తెలిసిందే.
ఇంత కీలకమైన బాధ్యతల్ని జన్మభూమి కార్యక్రమంలో పెట్టడం ద్వారా… అనుకున్న లక్ష్యాన్ని టీడీపీ సాధించగలదా అనేదే అసలు ప్రశ్న..? ఎందుకంటే, శ్వేతపత్రాలపై సమాజంలోని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుందా అంటే… కొంత అనుమానమే! ఒకవేళ ఆ స్థాయి చర్చ అర్థవంతంగా జరగాలంటే… ముఖ్యమంత్రి విడుదల చేసిన పత్రాలను సామాన్యులకు అర్థమయ్యేట్టుగా వివరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా తమకు జరిగిన మేలేంటనేదే ఎక్కువ మంది ప్రజలకు ప్రధానాంశంగా ఉంటుంది. ఆ కోణం నుంచి ఈ శ్వేత పత్రాలను వివరించాల్సి ఉంటుంది. మరి, క్షేత్రస్థాయిలో జన్మభూమి నిర్వాహకులు ఎంతవరకూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలరో చూడాలి. ఇంకోటి… జన్మభూమి కమిటీలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ముందుగా వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.