తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై రగడ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించి ఆర్డినెన్స్ విడుదల చేసి… ఎన్నికలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం.. ఆ డిమాండ్లను పట్టంచుకోకుండా ఎన్నికలకు సిద్ధమయింది.
గతంలో 34 శాతం ఇప్పుడు 22 శాతమే బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు..?
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. బీసీ రిజర్వేషన్లపై చర్చ ఇప్పటిది కాదు. గత పంచాయతీ ఎన్నికల సమయంలోనూ.. ఇది ఉంది. అయితే .. అప్పట్లో.. కోర్టును ఒప్పించి.. 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించగలిగారు. ఇటీవల హైకోర్టు జనవరి ఐదో తేదీలోపు ఎన్నికలు జరపాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. అయితే.. మరి గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగాయి కదా.. అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంది.. ఇప్పటి ప్రభుత్వం ఆ చొరవ ఎందుకు తీసుకోలేదన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
ఆర్డినెన్స్ తెచ్చే ముందు అఖిలపక్షంతో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు..?
అగదే సమయంలో.. ఏకపక్షంగా.. రిజర్వేషన్లను తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. అలా చేయకుండా.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పరిస్థితి చెప్పాల్సింది. అఖిలపక్షమా.. తోక పక్షమా అని కేసీఆర్ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ… ప్రజాస్వామ్యంలో అఖిలపక్షం అంటే… ప్రజాపక్షమే. ఎందుకంటే… కేసీఆర్ ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత కూడా టీఆర్ఎస్కు యాభై శాతం ఓట్లు రాలేదు. మిగతా యాభై శాతానిపైగా ఓట్లు ఇతర పార్టీలు.. వివిధ స్థాయిలో పొందాయి. అవన్నీ ప్రజలను రిప్రజెంట్ చేస్తాయి. శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా… వారు ప్రజల ఆదరణను ఏదో స్థాయిలో పొందినట్లే. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలుచుకున్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మిగతా వారికీ ప్రజల మద్దతు ఉంటుంది. ఇలాంటి పార్టీలన్నింటీతో సమావేశం ఏర్పాటు చేసి.. పరిస్థితుల్ని వివరించి చెప్పాల్సింది.
బీసీ రిజర్వేషన్ల కోసం కేసీఆర్ సిన్సియర్‌గా ప్రయత్నం చేయలేదా..?
యాభై శాతానికిపైగా ఉన్న బీసీలకు.. వారి జనాభాకు అనుగుణంగా రాజకీయం ప్రాధాన్యత దక్కడం లేదనేది నిజం. ప్రజాస్వామ్యంలో.. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం చేయాలి. అదే సమయంలో బీసీల్లోని కొన్ని సామాజికవర్గాలు మాత్రమే… ఎక్కువగా అవకాశాలు పొందుతున్నాయి. బీసీల్లో అగ్రస్థాయిలో కొన్ని సామాజికవర్గాలకే కాకుండా… ఇతర సామాజికవర్గాలకూ అధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంది. లెక్క ప్రకారం .. వార్డులస్థాయిలో కూడా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. కానీ.. పది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది కానీ… గత నాలుగున్నరేళ్లుగా అధికారంలోనే ఉన్నారు కదా.. ఎందుకు చేయలేదు…?. అందుకే… బీసీల రిజర్వేషన్ల విషయంలో మరింత ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసి ఉడాల్సింది.
పార్టీలన్నీ యాభై శాతం సీట్లిస్తే ఎవరు కాదంటారు..?
రాజ్యాంగ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. తాము యాభై శాతానిపైగా.. సీట్లను… బీసీలకు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని… అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే .. అన్ని పార్టీలు.. టీఆర్ఎస్ తరహాలో నిర్ణయం తీసుకుని.. పంచాయతీల్లో యాభై శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలి. రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో… పంచాయతీల్లో బీసీల ప్రాతినిధ్యం కనీసం యాభై శాతం ఉండేలా.. అభ్యర్థుల్ని నిలబెట్టేలా ప్రయత్నం చేయాలి. లేకపోతే.. బీసీల కోసం చేసేది అంతా రాజకీయమే అవుతుంది.