హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మరోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాబోతున్నారు. రేపు రోహిత్ వేముల జన్మదినం సందర్భంగా యూనివర్సిటీలో జరుగనున్న మాస్ హంగర్ స్టైక్లో రాహుల్ పాల్గొనబోతున్నారు. ఈ అర్ధరాత్రినుంచి రేపు సాయంత్రం వరకు ఈ సామూహిక నిరాహార దీక్ష జరుగుతుంది. రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి రాహుల్ దీక్షలో పాల్గొనబోతున్నారు. రాహుల్ ఇప్పటికే ఒకసారి… ఈ నెల 19న హైదరాబాద్ వచ్చి రోహిత్ అనుచరులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, తన అవసరమేదైనా ఉంటే తనకు చెప్పాలని, వెంటనే వస్తానని రాహుల్ నాడు చెప్పారు. రోహిత్ జన్మదినం సందర్భంగా నిర్వహించే సామూహిక నిరాహారదీక్ష గురించి అతని అనుచరులు రాహుల్కు తెలియబరచటంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ అర్ధరాత్రి యూనివర్సిటీకి రానుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే యూనివర్సిటీకి చేరుకుని సన్నాహక ఏర్పాట్లు చూస్తున్నారు.