శబరిమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసి వేశారు. ఇద్దరు మహిళలు సంప్రదాయాలకు భిన్నంగా అయ్యప్పను దర్శనం చేసుకున్నట్లుగా ప్రకటించుకోవడంతో పాటు.. దానికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు తాము మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నామని ప్రకటించారు. తమను ఎవరూ అడ్డుకోలేదన్నారు. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే.. ఆలయాన్ని ప్రధాన అర్చకుడు మూసి వేయాలని ఆదేశించారు. శుద్ధి చేసిన తర్వాత మళ్లీ ఓపెన్ చేసే అవకాశం ఉంది.
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా సంప్రదాయం ఉంది. అయితే ఆలయంలోకి ఎవరైనా వెళ్లవచ్చంటూ.. సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు చెప్పిన దగ్గర్నుంచి రాజకీయం రాజుకుంది. తీర్పును రాజకీయ పార్టీలు రాజకీయం చేశాయి. మొదట్లో.. తీర్పును స్వాగతించిన పార్టీలు తర్వాత … సంప్రదాయాలే ముఖ్యమంటూ ఆందోళనలు ప్రారంభించాయి. అది కాస్త.. ఓ దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది. అయ్యప్పస్వామిపై భక్తి ఉందో లేదో కానీ.. సంచలనం కోసం .. కొంత మంది మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించడంతో… వివాదం రేగింది. అది ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పను దర్శించుకున్నట్లు చెబుతున్న బిందు, కనకదుర్గ అనే మహిళలు..చాలా రోజుల నుంచి ఈ ప్రయత్నాలను చేస్తున్నరు. గతంలో వీరిని పోలీసులే పంబ నుంచి సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం వరకు తీసుకొచ్చారు. అక్కడ భక్తులు వీరిని అడ్డుకోవడంతో ఆ సమయంలో పోలీసులు వారిని వెనక్కి పంపించారు. ఈ సారి కూడా పోలీసులే వారిని ఆలయంలోకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.