మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దగ్గరగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ప్రెస్‌మీట్ పెడుతూ ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడ్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. తాజాగా… మేధావికి తనకు ఉన్న ఇమేజ్‌కు అనుగుణంగా.. స్పందించిన సందర్భం… శ్వేతపత్రాల ద్వారా వచ్చింది కాబట్టి.. మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనదైన వాదనతో… చంద్రబాబు శ్వేతపత్రాలు సత్యదూరమని తేల్చి చెప్పారు. శ్వేతపత్రాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పదిరోజుల పాటు పది శ్వేతపత్రాలు విడుదల చేశారు. ప్రజల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు. పది రోజుల పాటు జరిగే జన్మభూమిలో వాటినే చర్చకు పెట్టాలని నిర్ణయించారు.
ఇలాంటి సమయంలో శ్వేతపత్రాలపై.. ఉండవల్లి అరుణ్ కుమార్ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఆయనను ఎవరైనా టీడీపీ నేతలు సీరియస్‌గా తీసుకుంటారో లేదో మరి..! వారెవరూ తీసుకోకపోయినా.. శ్వేతపత్రాల్లో డొల్ల తనాన్ని ఆయన ఏదైనా ఓ టీవీ చానల్ వేదికగా ప్రయత్నించవచ్చు. వైట్పేపర్స్కి బ్లాక్ పేపర్స్ రిలీజ్ చేస్తామంటున్న వైసీపీకి..ఆ పార్టీ మీడియాకు.. ఉండవల్లి చెప్పే .. శ్వేతపత్రాల్లో అసలు నిజాలు చాలా అవసరం కూడా. ఆ ప్రయత్నం చేస్తారో లేదో మరి…?. శ్వేతపత్రాలు అన్ని అబద్ధమనడం మాత్రమే కాదు.. పోలవం ప్రాజెక్ట్‌పై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని కూడా ఉండవల్లి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా.. శ్వేతపత్రాలు విడుదల చేయలేదు. వివిధ రంగాల వారీగా… విడుదల చేసింది. బహుశా ఇది చాలా చిన్న విషయం. ఉండవల్లి వంటి మేధావి అంచనా వేయలేకపోవచ్చేమో..! ఓ శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఉండవల్లి ఆరోపించారు. నిజానికి గతంలో.. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం వెల్లడించిన దాని ప్రకారం.. ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్ట్‌ను ప్రైవేటు వ్యక్తులెవరూ తీసుకోరు. కేంద్ర ప్రభుత్వ సంస్థే సరఫరా చేస్తుంది. బహుశా.. ఇలాంటి ట్విస్ట్ ఇస్తే.. ఎవరైనా టీడీపీ నేతలు .. .. ఆ పాయింట్ పట్టుకుని ముందుకు వస్తారని.. మిగతా శ్వేతపత్రాలపై చర్చనూ కొనసాగించవచ్చని.. ఉండవల్లి ప్లాన్ వేసినట్లు ఉన్నారు.
చంద్రబాబుపై విమర్శలను.. ఉండవల్లి శ్వేతపత్రాలకే పరిమితం చేయలేదు. తెలంగాణ ఎన్నికలపైనా దృష్టి పెట్టారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వెళ్లకుండా ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషించారు. బహుశా ఇలాంటి విశ్లేషణ చేసిన కాంగ్రెసేతర, బీజేపీయేతర చివరి నేత ఉండవల్లి కావొచ్చేమో..? ఇప్పటికే చాలా మంది ఇలాంటి విశ్లేషణ చేశారు. కూటమి గెలిస్తే చంద్రబాబు క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూశారని కూడా ఓ విమర్శ చేసేశారు. గెలిచి ఉంటే.. చంద్రబాబుకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ వచ్చేది.. ఓడిపోయారు కాబట్టే.. ఓత్తిడికి గురవుతున్నారని…టీడీపీ నేతలు కౌంటర్లు ప్రారంభించారు.