రాఫెల్‌పై .. నరేంద్రమోడీతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్ చేశారు. ఈ విషయంలో.. మోడీ సిద్ధమా…అని చాలెంజ్ చేశారు. నరేంద్రమోడీ దేశానికి కాపలాదారు కానే కాదని.. ఆయన దొంగ అని తేల్చేశారు. ఈ రోజు పార్లమెంట్లో పరిణామాల తర్వతా రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ పెట్టి.. నరేంద్రమోడీపై చెలరేగిపోయారు. సైన్యం పేరు చెప్పి… భావోద్వేగాలు రెచ్చగొట్టి.. రాఫెల్ స్కాం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని మండి పడ్డారు. వాస్తవాలు దేశానికి తెలియాల్సి ఉందన్నారు. దేశం కనీ వినీ ఎరుగని కుంభకోణం రాఫెల్ స్కాం అని రాహుల్ గాంధీ తేల్చేశారు.
అంతకు ముంతు పార్లమెంట్లో రాఫెల్ స్కాం వ్యవహారం కలకలం రేపింది. రక్షణ శాఖ మాజీ మంత్రి , ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారీకర్… దగ్గర రాఫెల్ స్కాంకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉన్నాయన్న ఓ ఆడియో టేప్‌ను కాంగ్రెస్ బయట పెట్టింది. దాన్ని లోక్‌సభలో వినిపించేందుకు.. రాహుల్ ప్రయత్నించారు. కానీ స్పీకర్ అంగీకరించలేదు. అదే సమయంలో అరుణ్ జైట్లీ రాహుల్‌పై ఎదురుదాడి చేశారు. రాహుల్ వేసిన అనేక మౌలిక ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కానీ… రాహుల్ గాంధీ అబద్దాలు చెబుతున్నారని.. ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ లోపలే కాదు బయట కూడా రాఫెల్ డీల్ కలకలం రేపింది. ఎంపీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చకు కారణం అయింది. రాఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని.. సుప్రీంకోర్టును కూడా.. పట్టించుకోకుండా.. ఆరోపణలు చేస్తూ.. సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారంటూ.. రాహుల్‌పై.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం.. రాఫెల్లో కనీవినీ ఎరుగని స్కాం జరిగిందని గట్టిగా ఆరోపిస్తున్నారు.
రాఫెల్ విషయంలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌పై… రివ్యూ పిటిషన్ దాఖలైంది. గతంలో పిటిషన్ దాఖలు చేసిన మాజీ బీజేపీ నేతలు అరుణ్ శౌరి, జస్వంత్ సింగ్..రివ్యూ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. రిలయన్స్ ఆఫ్సెట్ పార్టనర్ అవడం దగ్గర్నుంచి ధరల వరకూ ప్రజల్లో అనేక అనుమానాలు వచ్చాయి. వాటికి ఇప్పటి వరకూ సమాధానం లభించలేదు. అదే అంశాలను హైలెట్ చేస్తూ రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా.. ఇంత వరకూ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. కొత్త ఏడాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్యూ కూడా రికార్డెడ్నే. తమ పార్టీ నేతలు పప్పు అంటున్న రాహుల్‌నే ఇప్పుడు.. మోడీకి సవాల్ చేశారు. మరి ఆ పప్పు విసిరిన సవాల్ ను మోడీ స్వీకరిస్తారా..? లేదా..?