విభజన హామీలకు సంబంధించిన స్పష్టత తమకు ఉందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదని విమర్శించారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అడ్రస్ చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు తమతో ఉన్నారా లేదనేది ప్రధానం కాదనీ, విభజన హామీలూ ఆంధ్రా అభివృద్ధి అనేదే ప్రధానమంత్రికి ప్రధానమైన అంశమని కన్నా చెప్పారు! విభజన చట్టంలో పెట్టారా పెట్టలేదా అనేది ఇష్యూ కాదనీ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే అనేక రంగాల్లో అత్యధిక నిధులిచ్చామన్నారు కన్నా. తమ గొంతును పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా బలమైన మీడియా మద్దతుతో చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు జీవితంలో నిజం చెప్పడం అనేదే లేదనీ, ప్రతీ మాటా అబద్ధమేననీ, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమం మోసపూరితమని కన్నా విమర్శించారు.
విశాఖపట్నం రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్… ఇవి హామీలు కావనీ, ఈ మూడూ ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని విభజన చట్టంలో ఉందని కన్నా చెప్పారు! పరిశీలించమని చెప్పినా కూడా నూటికి నూరుపాళ్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడిందనీ, విభజన చట్టానికి పదేళ్ల సమయం ఉందనీ, కానీ ఐదేళ్లలో చట్టంలో పెట్టినవన్నీ చేసేశామని కన్నా అన్నారు. ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రాభివృద్ధి పట్టదు కాబట్టి… ఈ మూడు అంశాలకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు కన్నా. కడప కర్మాగారానికి శంకుస్థాపన చేయడం రాయలసీమ ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు..? తనకు పాంప్లెట్ గా పనిచేసే మీడియాతో అబద్ధాలు రాయించుకుని ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, కానీ ఆయన చెప్పుకోవడానికి ఆయన నిర్మించిన ప్రాజెక్టు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలన్నీ పూర్తి చేసేశామనీ, ఇంకా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూనే ఎన్నికలకు వెళ్తామని కన్నా స్పష్టం చేశారు.
ఐదేళ్లలో అన్నీ చేసేశామని కన్నా అంటారు! పదేళ్ల సమయం ఉందనీ ఆయనే చెబుతారు. ఏం చేశారయ్యా అంటే.. ఆ మూడు తప్ప అంటారు! ఆంధ్రాకి కావాల్సిన అసలు అంశాలే అవే కదా. వాటిని ఇచ్చి తీరతామనీ ఇంకా సమయం ఉంది కదా అనీ ఆయనే అంటారు. ఇద్దామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సహాకారం అందడం లేదంటారు. ఇంతకీ.. కన్నా ఏం చెప్పాలనుకున్నారు..? చెప్పడానికి విషయం లేదు కాబట్టి, ఏదో ఒకటి చెప్పేద్దామన్నట్టుగానే ఆయన మాటతీరు కనిపిస్తోంది.