ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటులో మరోసారి సూటిగా ప్రశ్నించి ఏపీ ఎంపీ గల్లా జయదేవ్. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ రాఫైల్ ఒప్పందానికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. డస్టాల్ ఏవియేషన్స్ ఈ రాఫైల్ డీల్ విలువ రూ. 60 వేల కోట్లని చెబుతుంటే, మోడీ సర్కారును అది కేవలం రూ. 24 వేల కోట్లని మాత్రమే అంటోందనీ, దీనిపై రక్షణమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని గల్లా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే రెండున్న రెట్లు ఎందుకు చెల్లిస్తున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.
గోవా వైద్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణెకు సంబంధించిన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అయిందనీ, రాఫైల్ ఒప్పందానికి సంబంధించిన ఫైల్స్ గోవా ముఖ్యమంత్రి బెడ్ రూమ్ లో ఉన్నాయని ఆయన అన్నారనీ, దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్యమైన ఒప్పందం ఫైళ్లు గోవా సీఎం బెడ్ రూమ్ లో కి ఎలా వెళ్లాయని జయదేవ్ ప్రశ్నించారు. 2015, ఏప్రిల్ లో ప్రధానమంత్రి ఫ్రాన్స్ లో హటాత్తుగా రాఫెల్ డీల్ ను ప్రకటించేశారన్నారు. యుద్ధ విమానాలు అవసరం ఉన్నాయని ముందుగా రక్షణ శాఖ స్పష్టత ఇవ్వాలనీ, కానీ ముందుగా ప్రధాని విమానాలు కొంటున్నట్టు ప్రకటించిన తరువాత… వాటి అవసరం ఉందంటూ రక్షణ శాఖ చెప్పిందన్నారు. రక్షణ శాఖకు అవసరం ఉందో లేదో కూడా తెలుసుకోకుండానే రాఫైల్ విమానాలు కొంటున్నట్టు ప్రధాని ఎలా ప్రకటించారో జవాబు చెప్పాలన్నారు గల్లా జయదేవ్.
యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో ఈ డీల్ కుదిరినప్పుడు ఉన్న ఒప్పందాలేంటీ, ఇప్పుడు కొత్తగా మార్చుకున్న అంశాలేంటో చెప్పాలన్నారు. ఈ ఒప్పందం కోసం ప్రధాని మోడీ ఫ్రాన్స్ కి వెళ్లినప్పుడు, ఆయనతోపాటు వెళ్లిన ఇతరుల వివరాలను బయటపెట్టాలనీ, ఒప్పందం జరిగిన తీరును వివరించాలని డిమాండ్ చేశారు. పాత ఒప్పందం కాదంటూ, కొత్తగా ఒప్పందం చేసుకోవడం వల్ల కలిగిన లాభాలేంటో చెప్పాలన్నారు. ప్రధాని గొప్పగా చెప్పిన మేక్ ఇన్ ఇండియా ఏమైందనీ, ఆ యుద్ధ విమానాలను మనదేశంలోనే తయారు చేసుకోకుండా, ఎందుకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామో చెప్పాలన్నారు. పాత ఒప్పందం ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 126 విమానాలు అవసరం ఉందని చెప్పిందనీ, కానీ కొత్త ఒప్పందం ప్రకారం 36 మాత్రమే కొంటున్నారనీ, ఈ లెక్కన మిగిలిన 90 విమానాలు ఏమైనట్టని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్ కంపెనీ యుద్ధ విమానాలను ఎలా తయారు చేయగలదని ప్రభుత్వం భావించిందన్నారు.
ఈ ఆరోపణలన్నీ ప్రధానమంత్రిపైనే వస్తున్నా.. దురదృష్టం ఏంటంటే మోడీ స్పందించక పోవడమన్నారు. కనీసం దీనిపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆయన సభలో ఉండకపోవడం మరీ దారుణమన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని అంశాలపై తాను గంటకుపైగా మాట్లాడాననీ, కానీ ఒక్కటంటే ఒక్కదానిపై కూడా ప్రధాని స్పందించలేదన్నారు గల్లా జయదేవ్. ఈ ప్రధానికి పార్లమెంటు అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, చట్టబద్ధ ప్రక్రియలపై కూడా గౌరవం లేదని గల్లా ఆరోపించారు. ప్రభుత్వంలో ప్రధాని పాత్రతోపాటు, ఒప్పందంలో వాస్తవాలను వెలికి తీసేందుకు వెంటనే ఒక కమిటీ వేయాలని గల్లా డిమాండ్ చేశారు.