“వంగవీటి రంగా పాములాంటోడు.. ఆయనను చంపితే తప్పేముందంటూ..” ఓ టీవీ చానల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి…ఓ సందర్భంలో రాజకీయ వేడి పుట్టించిన వైసీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి.. మరోసారి తన టంగ్ పవర్ చూపించారు. ” పాలిచ్చే ఆవును వాడుకుని వదిలేసినట్టు ముస్లింలు తమ భార్యలను వదిలేస్తారు..” అని ట్రిపుల్ తలాఖ్‌పై.. ఓ టీవీ చానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న గౌతం రెడ్డి.. తన అభిప్రాయాన్ని చాలా విశాలంగా.. ప్రజల ముందు ఉంచారు. మామలుగా అయితే వ్యక్తిగత అభిప్రాయం అయ్యేదేమో కానీ.. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నారు. గౌతం రెడ్డి మాటలు ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయి. కొన్ని ముస్లిం సంస్థలు.. గౌతం రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇస్లాం ధర్మం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని .. ఆయనపై వైసీపీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముస్లింల ఆగ్రహం పెరుగుతూండటంతో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కాస్త ఆలస్యంగానైనా స్పందించారు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ.. ఓ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నిజానికి వంగవీటి రంగాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసినప్పుడు .. టీవీలో ప్రచారమై.. దుమారం రేగినప్పుడు కూడా.. జగన్ పట్టించుకోలేదు. అదో కార్చిచ్చులా మారే ప్రమాదం ఏర్పడటంతో చివరికి…సస్పెండ్ చేశారు. కానీ అదంతా ఉత్త పేరుకే. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ అయితే.. ఆయనను పార్టీ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ చివరికి.. గౌతంరెడ్డిపై.. తూతూ మంత్రంగా వేసిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి.. రాధాకృష్ణను.. తొలగించబోతున్నారు. ఇప్పటికే పొమ్మనలేక పొగబెట్టారు.
గౌతంరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువు. ఆ కారణంగానే.. ఆయన తన టంగ్ పవర్‌ని చూపిస్తూంటారని చెబుతూంటారు. ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ రేసులో లేరు. తను అటు వంగవీటి రాంగాపైన.. ఇటు ముస్లింలపైనా .. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడానికి ఇది కూడా ఓ కారణమే. ఆయనకు పెద్దగా అనుచర గణం లేకపోయినా.. బంధువన్న కారణంగా వైసీపీ భరించాల్సి వస్తోంది. షోకాజ్ నోటీసులిచ్చి ఎప్పటికప్పుడు.. కవర్ చేసుకోవాల్సి వస్తోంది.