2017 దిల్‌రాజు కెరీర్‌కి ఓ మైలు రాయి. ఏకంగా ఆయన సంస్థ నుంచి ఆరు సినిమాలొచ్చాయి. ఎంసీఏ, ఫిదా, నేనులోకల్, శతమానం భవతి.. ఇలా హిట్లు మీద హిట్లు కొట్టారు. డీజే కూడా ఆర్థికంగా సంతృప్తినే అందించింది. అయితే 2018 మాత్రం దెబ్బకొట్టేసింది. అటు నిర్మాతగా, ఇటు పంపిణీ దారుడిగా ఆయనకేమాత్రం కలసి రాలేదు. శ్రీనివాస కల్యాణం, లవర్చిత్రాలు పూర్తిగా నిశార పరిచాయి. ఇప్పుడు ఆయనకో బ్రేక్ కావాలి. అది ‘ఎఫ్ 2’ రూపంలో వస్తుందని ఆయన ఆశ.
ఎందుకంటే అనిల్ రావిపూడి.. దిల్‌రాజుకి బాగా కలిసొచ్చాడు. సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో ఈ సంస్థకు రెండు విజయాల్ని అందించాడు అనిల్ రావిపూడి. ఇది ముచ్చటగా మూడో సినిమా. కాబట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే ధీమా దిల్‌రాజు మొహంలో కనిపిస్తూనే ఉంది. సంక్రాంతికి వచ్చే సంపూర్ణమైన వినోదాత్మక చిత్రమిదే. కుటుంబ ప్రేక్షకులతో చూసే లక్షణాలూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి… ‘బాగుంది’ అనిపించుకుంటే దిల్‌రాజుకి తిరుగుండదు. 2017లో పెద్ద సినిమాతో పోటీగా ‘శతమానం భవతి’ విడుదల చేసి సూపర్ హిట్ కొట్టారు దిల్‌రాజు. ఇప్పుడూ అదే సెంటిమెంట్ ఆయన్ని ఊరిస్తోంది. `ఎఫ్ 2` అనుకున్న విజయాన్ని అందుకుంటే.. 2018 లోటుని ఈ యేడాది ఆరంభంలోనే తీర్చుకునే అవకాశం ఉంటుంది..