లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది ఎంపీల్ని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను మొదటగా సస్పెండ్ చేసిన సుమిత్రా మహాజన్.. మధ్యాహ్నం మరో ఇద్దరిపైనా నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. కావేరీ జలాల అంశంపై స్పీకర్ పొడియం వద్ద టీడీపీ ఎంపీలతో పాటు నినాదాలు చేసిన అన్నాడీఎంకే ఎంపీలను సైతం స్పీకర్ నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెండైన వారు బయటకు వెళ్లకుండా సభలోనే ఉండంతో… శుక్రవారానికి సభ వాయిదా వేశారు.
ఇన్ని రోజుల నుంచి.. నిరనస సాగిస్తున్నా.. ఈ రోజు మాత్రమే… ఎందుకు టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఎందుకు వేశారన్నదానిపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సస్పెన్షన్ విషయం తెలిసిన తర్వాత నిరసన కొనసాగించాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. విభజన హామీలపై పోరాడుతున్న టీడీపీ ఎంపీలను.. ఇవాళ సస్పెండ్ చేయడం వెనకున్న ఆంతర్యం ఏంటని సుజనా చౌదరి విమర్శించారు. బీజేపీని ధిక్కరించి ముందుకెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి నిధులు అడిగే హక్కు మనకు లేదా అని ప్రశ్నించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికే మచ్చ అని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయాలని కోరితే గొంతు నొక్కేస్తున్నారన్నారు. మోదీ, జగన్ కలిసి ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనూహ్యంగా టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయడానికి కారణం ఏమిటన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. ఏపీకి సంబంధించిన ఏ అంశంపైనా… ప్రకటన చేయబోతున్నారా… దానికి అడ్డం లేకుండా.. ఎంపీలను బయటకు పంపారా.. అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో.. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట తమ ఆందోళన కొనసాగించే అవకాశాలున్నాయి.