తెలంగాణలో ఎన్నికల అక్రమాలపై గట్టిగా పోరాడాలని టీ పీసీసీ నిర్ణయించుకుంది. ఈ మేరకు… కార్యాచరణ ప్రారంభించింది. మొదటగా.. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరును అందులో వివరించారు. దానికి సంబంధించి వివిధ పత్రికల కథనాలతో పాటు పోల్ అయిన ఓట్లకు… కౌంటింగ్ లో వచ్చిన ఓట్లకు ఉన్న తేడాలను… ఈసీ వెల్లడించిన అధికారిక రికార్డుల నుంచి సేకరించి.. లేఖకు జత చేశారు. తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి..బ్యాలెట్ ద్వారా జరపాలని పొన్నాల డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. నేరుగా.. టీ పీసీసీ బృందంతో.. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కూడా పొన్నాల ప్రకటించారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఇప్పటికే పోలయిన ఓట్లకు.. కౌంటింగ్ వచ్చిన ఓట్లలో తేడా వచ్చిన నియోజకవర్గాల్లో వివరాలన్నింటినీ సేకరించింది. అధికారికంగా కోర్టులో పిటిషన్ వేయడానికి అవసరమైన రిటర్నింగ్ అధికారుల రికార్డు చేసే అధికారిక సమాచారం కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు జరిగాయన్న వాదనకు బలం చేకూర్చే మరికొన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మార్జిన్ తక్కువ ఉన్న నియోజకవర్గాల్లో న్యాయపోరాటం ప్రారంభిస్తే.. ఇతర నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటికే ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈయనకు కాంగ్రెస్ మద్దతిచ్చినా… కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి కాదు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫలితాల్నీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎవరూ దాని గురించి ఆలోచించలేకపోతున్నారు. తాము ఎలా ఓడిపోయామో అనే విశ్లేషణే చేసుకుంటున్నారు. అంతిమంగా వారికి.. ఎన్నికల్లో అక్రమాలే కనిపిస్తున్నాయి తప్ప.. తాము ఓడిపోవడానికి వేరే కారణాలు కనిపించడం లేదు. అందుకే.. న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. పరిస్థితి .. ఓ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత .. ఏదో అక్రమాలు చేశాడని.. హైకోర్టుకు వెళ్లిన ప్రత్యర్థిలా కాంగ్రెస్ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. ఆ విచారణ .. ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయే వరకూ తీరదు. కాంగ్రెస్ సందేహాలు … పోరాటం కూడా అంతే అయినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది.