జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. మొత్తం పదకొండు కేసుల్లో… మూడు కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇప్పుడు… న్యాయమూర్తుల్ని బదిలీ చేయడంతో.. కొత్తగా వచ్చే న్యాయవాది మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాల్సి ఉంటుందని తేలింది. శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి బృందానికి ఈ విషయం తెలిసింది. గత వారం విచారణలోకూడా.. న్యాయమూర్తి తాను.. ఏపీకి బదిలీ అయ్యానని.. తాను విచారించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో.. విచారణ జరపలేదు. ఈ సారి… కొత్త గా వచ్చే జడ్జి విచారణ కొత్తగా ప్రారంభించనున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల ఇరవై ఐదో తేదీకి విచారణను కోర్టు వాయిదా వేసింది.
హైకోర్టు విభజన వ్యవహారం లో.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో.. జగన్ కేసుల వ్యవహారం కూడా ఉంది. నోటిఫికేషన్ ఇవ్వగానే.. సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించడం వెనుక జగన్ కేసుల విచారణ ఆలస్యం చేయాలనే కోణం ఉందని చంద్రబాబు హైకోర్టు విభజన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రకటించారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని… ఇలా చేయడం వల్ల జగన్ కేసులకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని… ఆ దృష్టితో కూడా విభజన చేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే జరిగింది. మళ్లీ మొదటి నుంచి వినాల్సిందేనని కొత్తగా వచ్చిన న్యాయమూర్తి చెప్పారు.
నిజానికి జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ఎప్పుడో ముగిసింది. మొత్తం పదకొండు చార్జిషీట్లలో… మూడింటిలో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే వాటిపైనే విచారణ జరుగుతోంది. అసలు కేసుల విచారణ ప్రారంభం కాలేదు. జగన్ కేసు విషయంలో ఇప్పటికే వివిధ కారణాల రీత్యా చాలా ఆలస్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈడీ దూకుడుగా వ్యవహరించి.. కొన్ని ఆస్తులు జప్తు చేసినప్పటికీ.. ఆ తర్వాత బీజేపీతో వైసీపీ సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత నెమ్మదించిందనే విమర్శలు టీడీపీ వైపు నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నాయి.