ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు మహిళపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంత్రి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ప్రభుత్వం వితంతువులకు ఇస్తున్న పెన్షన్లు దుర్వినియోగం అవడం గురించి మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అయితే సున్నితమైన ఈ విషయంపై ఆచితూచి మాట్లాడాల్సింది పోయి మహిళలు దుక్కల్లా ఉన్నారు, భర్త ఉన్నాడా పోయాడా చెప్పారు లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన పాత్రుడు ఏమన్నారంటే..
‘భర్త చనిపోయినవారికి పెన్షన్ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ . ఇవీ మంత్రి గారి వ్యాఖ్యలు.
ఊహించినట్టుగానే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలను మహిళలు ఖండిస్తున్నారు. ఆ మధ్య వర్ల రామయ్య దళితుల గురించి చేసిన వ్యాఖ్యలు, అలాగే బాబు రాజేంద్రప్రసాద్ విజయమ్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలాగే వివాదాస్పదం అయ్యాయి. తెలుగుదేశం నాయకులు బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా జాగ్రత్త పడతారా లేదా అన్నది వేచి చూడాలి.