వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించి… ఎన్ఐఎ విచారణకు హైకోర్టు ఆదేశించలేదు. అంతకు ముందే కేంద్రం ఆదేశాలకో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో విపక్ష నేత జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదుచేసినందున కొత్తగా ఆదేశాలు ఇచ్చేందుకు ఏమీ లేదని హైకోర్టు పేర్కొంది . జగన్‌పై కోడి కత్తి దాడి కేసు విషయంలో ఐదు రోజుల క్రితమే ఎన్ఐఏకు మార్గదర్శకాలు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం.అయితే ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. జగన్‌పై దాడి కేసును విచారించాలంటూ… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌కు డిసెంబర్ 31న ఉత్తర్వులు వెళ్లాయి. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రమే ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం…. కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 307, సివిల్ ఏవియేషన్ యాక్ట్ సెక్షన్ 3ఏ ( 1) ప్రకారం కేసులు నమోదుచేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలంటూ..వైసీపీ నేతలు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై.. అభిప్రాయం చెప్పాలంటూ..కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు సార్లు సరైన సమాధానం చెప్పలేదు. చివరికి నేటి విచారణ సమయానికి ఎన్ఐఏ కేసు నమోదుచేసిన విషయాన్ని ఏపీ హైకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అటు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జగన్ తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారవుతాయని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
హైకోర్టు ఆదేశించిందంటూ.. ప్రచారం జరిగింది కానీ.. అంతకు ముందే కేంద్ర ప్రభుత్వమే ఎన్ ఐ ఏ యాక్ట్ ప్రకారం.. విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో వారు కేసు నమోదు చేసి.. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో.. హైకోర్టు ఇక తాము ప్రత్యేకంగా ఆదేశాలిచ్చేదేమీ లేదని చెప్పింది.హోం శాఖ ఆదేశాలతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన విచారణ అధికారిగా మహ్మద్ సాజిద్ ఖాన్‌ను నియమించారు. ఆయనే కేసును దర్యాపు చేయబోతున్నారు.