శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం… చివరికి ఇదో రాజకీయాంశంగా రంగులు మారుతూ ఉందనడంలో సందేహం లేదు. తాజాగా ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం, ఆ తరువాత ఆలయాన్ని సంప్రోక్షణ చేయడం జరిగింది. శుక్రవారం కూడా ఒక మహిళ ఆలయ ప్రవేశానికి ప్రయత్నించడంతో యాథావిధిగా కొంత గొడవ జరిగింది. ఈ వివాదానికి పరిష్కారమంటే… సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయాలి, లేదంటే ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు మార్చుకునే అవకాశమైనా ఉండాలి! అయితే, ఈ వివాదం చుట్టూ రాజకీయ అంశాలే ఒక్కోటీగా ముడి బిగిస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది.
రామ జన్మభూమి అంశంతోనే దేశవ్యాప్తంగా రాజకీయంగా ఊపు తీసుకొచ్చిన గత చరిత్ర భాజపాకి ఉంది. అయితే, ఒక దశలో అద్వానీ రథయాత్ర చేసినా, ఈ అంశం ఉత్తరాదిని ఊపేస్తూ ఉన్నా… రాజకీయంగా దాని ప్రభావం దక్షిణాది వరకూ పెద్దగా రాలేదు. మతపరమైన అంశంతో ఉత్తరాదిలో వారికి వచ్చిన పొలిటికల్ మైలేజీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతవరకూ దక్కలేదు. అయితే, గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి టచ్ ఇచ్చేందుకు భాజపా ప్రయత్నించినా… అదీ పెద్దగా కలిసి రాలేదు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో భాజపా చొచ్చుకుని వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఏదో ఒక భావోద్వేగ పూరితమైన అంశం వారికి చోదక శక్తిగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడీ శబరిమల వివాదాన్ని కూడా అలాంటి అస్త్రంగా భాజపా మలుచుకుందా అనే అభిప్రాయాలు చాలా వినిపిస్తున్నాయి.
ఒక పథకం ప్రకారమే భాజపాకి మద్దతుగా నిలిచే కొన్ని సంస్థలు కేరళ చేరుకుని, వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నాయనేది కొంతమంది అభిప్రాయం. అయితే, కేరళలో భాజపాకి అంత బలం ఉందా అనే ప్రశ్న సహజంగానే ఇక్కడ తలెత్తుతుంది. కానీ, దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్. సభ్యత్వ నమోదులో కేరళ నుంచి అత్యధిక శాతం చేరినవారు ఉన్నారనేది గమనించాలి. మొత్తానికి, లోక్ సభ ఎన్నికల వచ్చేనాటికి కేరళలో ఇదొక శాంతి భద్రత సమస్యగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోందనీ, ఆ సమయంలో కేరళ ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందనేది సీపీఎం ఆరోపణగా వినిపిస్తోంది. దక్షిణాదిలో ఇదొక పూర్తి స్థాయి వివాదాస్పదాంశంగా మార్చేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఇట్టే కొట్టి పారేసే పరిస్థితి కనిపించడం లేదు.