విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తి ఘటన తెలిసిందే. దీని విచారణను ఎన్.ఐ.ఎ.కి కేంద్రం అప్పగించింది. నిజానికి, ఇప్పటికే ఆ కేసుపై ఇప్పటికే దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చేయించింది. అది పూర్తికాకుండానే ఎన్.ఐ.ఎ.కి విచారణను బదలాయించారు. ఉగ్రవాదం, విమానాల హైజాక్ లాంటి కేసులు దర్యాప్తు చేసే సంస్థకి… కోడి కత్తి దాడి కేసును అప్పగించడమేంటీ అనే విమర్శలు ఓపక్క వినిపిస్తున్నాయి. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు నివేదికను షీల్డు కవర్ లో పోలీసులు హైకోర్టుకి కూడా సమర్పించారు. అయితే, ఈ నేపథ్యంలో కేసు ఎన్.ఐ.ఎ.కి అప్పగించడంపై వైకాపా వర్గాలు విజయంగా చెప్పుకుంటున్న పరిస్థితి! ఇక, ఆ పార్టీ పత్రిక సాక్షి అయితే… ఎన్.ఐ.ఎ. దర్యాప్తు ఎలా ఉండాలి, ఎవరిని విచారిస్తే నిజం బయటకి వస్తుంది, ఏ కోణంలో కేసును ముందుకు తీసుకెళ్లాలనే ముందస్తు దిశా నిర్దేశం కూడా చేసేయడం విశేషం!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు కీలక పాత్రధారులను విచారిస్తే నిజం నిగ్గుతేలిపోతుందని సాక్షి ఓ కథనంలో పేర్కొంది. జగన్ పై కోడి కత్తి దాడి సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పోలీసును ప్రభావితం చేసేవిగా ఉన్నాయంటూ ఆ కథనంలో అభిప్రాయపడింది. ఏపీ మంత్రి నారా లోకేష్ కి సన్నిహితుడైన హర్షవర్థన్ చౌదరి చెందిన రెస్టారెంట్ లోనే నిందితుడు శ్రీనివాస రావు పనిచేస్తున్నాడనీ, అందుకే తనవారిని రక్షించుకోవడం కోసమే ముఖ్యమంత్రి అలా వ్యవహరించారా అనే అనుమానాలు ఉన్నాయట! ఇంతకీ, ఒక కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి పాత్రదారు అని ఎలాంటి ఆధారాలూ లేకుండా ఒక పత్రిక ఎలా అభిప్రాయపడుతుంది..?
ఎన్.ఐ.ఎ. విచారించాల్సిన వారిలో డీజీపీ ఠాకూర్ ఉండాలన్ని సాక్షి అభిప్రాయం. ఎందుకంటే, నిందితులు శ్రీనివాసరావుపై సెక్షన్ 307 కింద, అంటే హత్యాయత్నం అభియోగం మాత్రమే నమోదు చేశారనీ… దీని వెనక కుట్ర తెలియాలంటే సెక్షన్ 120 బి కింద నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అంటే… కోడి కత్తి దాడిని ఏ సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలనేది కూడా సాక్షి చెప్పేస్తుందన్నమాట! హర్షవర్థన్ చౌదరిని కూడా విచారించాలనీ ఆ పత్రిక రాసేసింది. ఎన్.ఐ.ఎ. దర్యాప్తు ఎలా ఉండబోతోందనేది అది వేరే విషయం. ఈ కేసులో మొదట్నుంచీ ముఖ్యమంత్రి, పోలీస్ బాస్ దర్యాప్తును ప్రభావితం చేశారనేదే కదా వైకాపా అభియోగం! మరి ఇప్పుడు వీళ్లు చేస్తున్నదేంటీ..? ఎవరెవర్ని విచారించాలీ, ఏ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలనేది చెప్పడాన్ని ఏమనాలి..? దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసే చర్య కాదా ఇది..? పోలీసు విచారణకే జగన్ సహకరించలేదే… దాన్నేమనాలి..?