ఆంధ్రప్రదేశ్ కి చెయ్యాల్సిన దాని కన్నా చాలా ఎక్కువ చేసేశామని భాజపా నేతలు చెబుతుంటారు! విభజన చట్టంలోని 90 శాతం అంశాలను అమలు చేసేశాం అంటారు. విచిత్రం ఏంటంటే… మిగిలిన ఆ పది శాతంలోనే ఏపీకి అవరమైన వంద శాతం అంశాలు ఉండటం. వాటి గురించి మాత్రం మాట్లాడరు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి అమరావతి రాజధాని నిర్మాణ నిధులపై, ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సభ్యులు చలసాని శ్రీనివాస్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణతోపాటు కొంతమంది ఢిల్లీలో జైట్లీని కలిశారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ ఆర్థికమంత్రిని కోరారు. విభజన చట్టంలోని కేవలం పదిశాతం హామీల అమలు మాత్రమే ఏపీలో జరిగిందనీ, మిగతావి వీలైనంత త్వరగా అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
అయితే, విభజన చట్టం ప్రకారం తొంభై శాతానికి పైగా అంశాలను కేంద్రం నెరవేర్చేసిందనీ, మిగతావి కూడా నెరవేర్చుందుకు మోడీ సర్కారు కట్టుబడి ఉందని అరుణ్ జైట్లీ అన్నారు. ఆంధ్రా రాజధాని అమరావతి కోసం రూ. 3500 కోట్ల నిధులు ఇచ్చామనీ, కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాకి బదులుగా ప్యాకేజీ ద్వారా నిధులు ఇస్తామమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారనీ, ఆ తరువాత ఆయనే మాట మార్చేశారని జైట్లీ విమర్శించారు. వెనకబడిన ప్రాంతాలకు రూ. 350 కోట్లు నిధులు ఇవ్వలేదన్న అంశంపై జైట్లీ స్పందిస్తూ… వాటిని త్వరలోనే కేంద్రం విడుదల చేస్తుందన్నారు.
అమరావతి నిర్మాణానికి రూ. 3500 కోట్లు ఇచ్చామని జైట్లీ అంటారు. కానీ, కేంద్రం రూ. 1500 కోట్లిచ్చి రాజధాని కట్టుకోమంటే ఎక్కడ సరిపోతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని అరుణ్ జైట్లీ ఢిల్లీలో కూర్చునే చెప్పేయడం మరీ విడ్డూరం! అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల్ని కనీసం రాష్ట్ర భాజపా నేతలు కూడా వెళ్లి చూడలేదు. ఇంకోటి… విభజన చట్టంలోనివి అన్నీ ఇచ్చేశామని ప్రతీసారీ అరుణ్ జైట్లీ అంటుంటారు. విశాఖపట్నం రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు… ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు..? చట్టం అమలులో ఇబ్బందులుంటే కేంద్రమే చొరవ తీసుకోవాలి. అది తమ బాధ్యత కాదన్నట్టుగా భాజపా వ్యవహరిస్తుంది. ఇంకోటి… తొంభై శాతం చట్టంలో అంశాలు అమలు చేసేశామని ఓసారి అంటారు, మరోసారి… చట్టంలో అంశాల అమలుకు పదేళ్లు సమయం ఉంది కదా అంటారు. ఆంధ్రాకి ఏమిచ్చారు అనే అంశంపై కేంద్రానివి ఎప్పుడూ గందరగోళ ప్రకటనలే.