జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియక చెబుతారో.. తెలిసి చెబుతారో కానీ.. తన వ్యవహారాలను.. సమర్థించుకోవడానికి ఆయన ప్రజారాజ్యం పార్టీని పదే పదే ఉదాహరణగా చూపిస్తూంటారు. అలాంటి ఉదాహరణలు చూపించడం వల్ల.. తన ఆలోచన స్థాయిపై.. అందరికీ అనుమానం వస్తుందనే.. అంశాన్ని కూడా ఆయన పట్టించుకోరు… తన అభిప్రాయాన్ని చెప్పేస్తారు. పార్టీ పెట్టే ఐదేళ్లయినా.. ఇంత వరకూ జససేనకు ఒక్క కమిటీ కూడా లేదు.. పార్టీ నిర్మాణం అనే ప్రస్తావన లేదని.. వస్తున్న విమర్శలకు ఆయన … విచిత్రమైన సమాధానం చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల వల్లే.. తాను పార్టీ కమిటీలు వేయలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో పదవులు పొందిన నేతలు.. ఇతర పార్టీలకు వెళ్లిపోయారట. ఆ కారణంగానే… పార్టీ కమిటీలు ఆలస్యం చేశానని చెప్పుకొచ్చారు. నేతలు వెళ్లిపోతారని.. కమిటీలు వేయకపోవడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు.
మరి అదే సమయంలో.. తాను అనేక సార్లు ఓడిపోతానని .. కానీ.. వేరే వారిని ఓడిస్తారనని చెప్పుకొచ్చారు. ఓడిపోతానని తెలిసినప్పుడు మరి పార్టీ పెట్టడం ఎందుకనే ప్రశ్న సహజంగానే పవన్ మాటల్ని విన్న వారికి వస్తుంది. జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్న పవన్… పీఆర్పీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. పీఆర్పీ ఉంటే సామాజిక న్యాయం జరిగి ఉండేదన్నారు. ఓపిక లేని నాయకులు చేరడం వల్ల అవకాశం చేజారిందని.. పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఓపిక లేని నాయకుల జాబితాలో అన్న మెగాస్టార్ ఉన్నారో లేరో చెప్పలేదు. ఆయన మాటల ద్వారా మాత్రం.. పీఆర్పీ .. అంతర్దానంలో.. చిరంజీవి తప్పేమీ లేదనే సూచనలు మాత్రం చేశారు. పీఆర్పీలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో. చిరంజీవిలాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారని చెప్పుకొచ్చారు. అయితే… ఒకరి చేరికతో వచ్చిన బలంతో.. చిరంజీవి ఎలా బలవంతుడవుతారు. వారు వెళ్లిపోతే.. చిరంజీవి ఎలా బలహీనపడతారో… పవన్ కే తెలియాలి. అన్నను సమర్థించడానికే … పీఆర్పీలోని ఇతర నేతలపై పవన్ నిందలేసినట్లుగా స్పష్టమవుతోంది. పీఆర్పీ ఏర్పాటులో తనది బలమైన పాత్ర అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో నేను ఒకడినన్నారు. అయితే.. ఈ ప్రేరణ పార్టీ పెట్టాడనికే.. పైన చెప్పినట్లు.. బలహీన నాయకుల జాబితాలో పవన్ లేరు.
చిరంజీవిని బలహీన పరిచిన జాబితాలో పవన్ కల్యాణ్ లేరు. ప్రతికూల పరిస్థితుల్లో జనసేన పార్టీని స్థాపించానని పార్టీ పెట్టినప్పుడు పెద్దనాయకులు లేరని గుర్తు చేశారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని పవన్ కల్యాణ్ అభిమానుల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు కావాలంటున్నారని… కానీ రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని పవన్ తేల్చారు. మొత్తానికి పీఆర్పీ అనుభవాలతో పవన్ కల్యాణ్ పార్టీని నడుపుతున్నారు కానీ.. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. మరో విధంగా అర్థం చేసుకుని.. జనసేనను రన్ చేస్తున్నారు. ఫలితంగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది జనసేన పరిస్థితి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.