రుణమాఫీ చేస్తే.. రైతులకు లాభం ఉండదా..? వారిని అప్పుల ఊబి నుంచి బయట పడేస్తే.. వారిని మోసం చేయడమా..? . రుణ మాఫీ చేయడం.. ఘోర పాపానికి ఒడి గట్టడమా..? అవుననే అంటున్నారు.. .ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రుణమాఫీ హామీతో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో ఇమేజ్ పెంచుకుంటూండటంతో… ఆయన దానికి కౌంటర్ గా .. రుణమాఫీపై నెగెటివ్ ప్రచారం ప్రారంభించారు. అది చాలా మోసంతో కూడుకున్న వ్యవహారమని చెప్పడం ప్రారంభించారు. జార్ఖండ్ లో ఈ ప్రచారాన్ని కొత్త తీరాలకు తీసుకెళ్లారు. రుణమాఫీని మోసం చేయడంగా తేల్చారు.
కాంగ్రెస్ హామీల దెబ్బకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ… రైతులకు రుణమాఫీ లాంటి పథకం ఏదో రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం.. రుణమాఫీ చేయడం అంటే.. రైతులను మోసం చేయడమేనని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఇంకా రెండు నెలల గడువు ఉండగానే ఆయన రాష్ట్రాలను చుట్టబెట్టి… ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. రైతు రుణమాఫీ అంటే రాజకీయం చేయడమేనని.. జార్ఖండ్ లో ప్రకటించారు. తాను రాజకీయం చేయాలనుకుంటే లక్ష కోట్లు రుణమాఫీ కింద రైతులకు ఇచ్చేసేవాడినని, కానీ, తాను రైతులను మోసం చేసే పాపానికి ఒడిగట్టబోనని గొప్పగా చెప్పారు. రుణమాఫీ చేస్తే కేవలం ఒక ఏడాదే ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు.
అదే రుణమాఫీ నిధులతో లక్ష ఎకరాలకు నీరు వస్తే భవిష్యత్తులో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోకుండా తాము పనిచేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా రైతుల సామర్థ్యాన్ని పెంచే విధానాలను అనుసరిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. పొలాలకు నీరందిస్తే తరాలు బతుకుతాయన్నారు. రుణమాఫీ ద్వారా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. మోడీ ఎన్ని చొప్పినా.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా.. అమలవలేదని రైతులకు అర్థమయింది. మరి ఇప్పుడు.. రుణమాఫీ కూడా వద్దని .. అదో మోసమని ప్రచారం ప్రారంభించారు.