రాఫైల్ యుద్ధ విమనాల కొనుగోలు ఒప్పందంపై పార్లమెంటులో తీవ్రమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. అయితే, దేశవ్యాప్తంగా ఇంత చర్చనీయాంశం అవుతున్నా, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీదే ఆరోపణలు వినిపిస్తున్నా… ఆయన మాత్రం పార్లమెంటుకు రావడం లేదు. రాఫైల్ చర్చపై ఇంతవరకూ ఆయన నోరు మెదిపిందీ లేదు. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆయన స్పందించక తప్పని పరిస్థితి వచ్చేలా ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కాంగ్రెస్ లేవనెత్తిన అనుమానాలకు సమాధానాలు వచ్చినా కూడా… ఆరోపణలు ఉన్నవి ప్రధానిపై కాబట్టి, ఆయన స్పందించాలన్న డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది.
మాజీ ప్రధాని దేవెగౌడ ఇదే అంశమై ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… రాఫైల్ డీల్ మీద ప్రధాని పార్లమెంటుకు వచ్చి మాట్లాడాలన్నారు. ఆయన గైర్హాజరీ వల్ల దేశ ప్రజలకు చాలా అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. రాఫైల్ వివాదంపై రక్షణ మంత్రి బాగానే వాదించారనీ, కానీ అది వేరే విషయమన్నారు. ఆరోపణలు వినిపిస్తున్నది మోడీపై కాబట్టి, ఆయన సభకు రావాలని దేవెగౌడ డిమాండ్ చేశారు. ప్రజలకు అనుమానించే విధంగా మోడీ ప్రవర్తన ఉంటోందనీ, రాఫైల్ పై మౌనంగా ఉండటం వెనక ఆయన ఉద్దేశమేంటో అని విమర్శించారు. తనపై విమర్శలు వస్తున్నప్పుడు, అవి కల్పితాలే అని ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు… వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుందనీ, ఆయన సమాధానం చెప్పకపోవడమే ఇప్పుడు అసలు సమస్యగా మారుతోందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.
నిన్నటి పార్లమెంటు సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఇదే పాయింట్ మీద మాట్లాడారు. తన బాధ్యతను రక్షణమంత్రి సమర్థంగా నిర్వహించారని అంటూనే… ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ ఆయనా డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాఫైల్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ… దీనిపై ప్రధాని ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల నుంచి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఈ డీల్ లో మోడీ పాత్ర ఏదీ లేకపోతే, ఆయన అవినీతికి పాల్పడలేదన్నదే నిజమైతే ఆ మాట ఆయనే ఎందుకు చెప్పడం లేదనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ, అమిత్ షా.. ఇలా ఎంతమంది రాఫైల్ ఒప్పందంపై వాదనకు దిగినా… మోడీ స్పందిస్తే తప్ప ఉపయోగం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. మరి, దీనిపై మోడీ స్పందన ఎలా ఉందో..? ఆయన ఎప్పుడు స్పందిద్దామనుకుంటున్నారో వేచి చూడాలి.