ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగే యాత్ర ముగింపు సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు వైకాపా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ముగింపు సభకు శ్రీకాకుళంతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు ఐదారు లక్షల జన సమీకరణ కోసం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలతోపాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా నుంచి సీట్లు ఆశిస్తున్నవారు కూడా పెద్ద సంఖ్యలో ముగింపు సభలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ ముగింపు సభలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి తొలి విడత జాబితాను జగన్ ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి, ఏ పార్టీకైనా ఎన్నికలకు కొన్ని నెలల ముందే పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి దాదాపు 50 లేదా 60 శాతం మంది పేర్లు ఖరారు అయిపోతాయి. అధికారికంగా ప్రకటన చెయ్యరు. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించి.. తెలంగాణలో మరోసారి విజయం దక్కించుకున్నారు కేసీఆర్. ఇప్పుడు అదే తెరాస మోడల్ ను అనుసరిస్తూ ఏపీలో వైకాపా కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించేస్తే… అసంతృప్తులూ రెబెల్స్ ను బుజ్జగించేందుకు చాలా సమయం ఉండే అవకాశం ఉంటుందనేది వ్యూహంగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పది నియోజక వర్గాల అభ్యర్థుల్ని జగన్ ప్రకటించేస్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
అయితే, ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించేయడం అనేది సక్సెస్ ఫుల్ వ్యూహంగా అన్ని సందర్భాల్లోనూ చెప్పలేం. తెలంగాణ పరిస్థితులు తెరాసకు కలిసొచ్చాయి. ఇంకోటి, కేసీఆర్ మూణ్నెల్లు ముందుగా ప్రకటించినవన్నీ సిట్టింగ్ స్థానాలే. పైగా, తెరాస అధికారంలో ఉంది. ముందుగా అభ్యర్థుల ప్రకటన అనేది అధికార పార్టీకి ఎప్పుడూ కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఇక, వైకాపా పరిస్థితికి వస్తే… తెరాసని అనుకరించాలనుకున్నా, ఆ స్థాయిలో అన్ని సీట్లను ప్రకటించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఈ అభిప్రాయానికి అనుగుణంగా జగన్ ప్రకటన ఉంటుందో లేదో చూడాలి. పాదయాత్ర ముగుస్తోంది కాబట్టి, ప్రజల్లో ఎన్నికల వేడిని ఇప్పట్నుంచీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనకు వైకాపా సిద్ధమౌతోందేమో మరి!