తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిపోయినా… అసెంబ్లీ ఇంత వరకూ సమావేశం కాలేదు. మంత్రులూ లేరు. ఈ నెల పదిహేడో తేదీన సమావేశం ఉంటుందని.. తాజాగా ప్రకటన జారీ అయింది. అయితే..అసెంబ్లీ సమావేశం కావడం… ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం.. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన విషయం కాదు. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు ప్రమాణం చేసినా చేయకపోయినా… వారు ఎమ్మెల్యేలే. ఈ విషయం సీఎం కేసీఆర్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే మంత్రి వర్గ విస్తరణ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే.
ఎన్నికలకు ముందుగా వెళ్లి.. కేబినెట్‌ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..?
ముఖ్యమంత్రిగా కేసీఆర్ , ఓ మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేసి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఓ ముఖ్యమంత్రి..మరో మంత్రి మీదనే నడుస్తోంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మంత్రిమండలి నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం నడిచే ప్రజాస్వామ్యం. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు. రాజ్యాంగ పరంగా పద్దెనిమిది మంది మంత్రుల్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ఓ ముఖ్యమంత్రి మరో.. మంత్రితోనే పాలన సాగిస్తున్నారు. ప్రత్యేకంగా రాజ్యాంగంలో.. ఎంత మంది మంత్రులు ఉండాలనే నిబంధన, ఎన్ని రోజుల్లోపు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన ఎక్కడా లేకపోవచ్చు. కానీ కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఏదో అత్యవసరంగా తప్పక వెళ్లాలి అన్నట్లుగా ముందస్తుకు వెళ్లారు. మరి అలాంటప్పుడు .. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు…?
ముహుర్తాలు లేవనా..? శాఖలను మార్చాలనా..?
మంత్రివర్గాన్ని విస్తరించడంలో కేసీఆర్ ఆలస్యం చేయడానికి ప్రధానంగా వినిపిస్తున్న కారణం.. కేసీఆర్‌కు నమ్మకాలెక్కువ. అందుకే ఫిబ్రవరి నాలుగో తేదీ వరకూ.. ముహుర్తాలు లేవు కనుక.. అప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ చేయరని చెబుతున్నారు. వ్యక్తిగత విశ్వాసాలను తప్పు పట్టలేం. ఆయన కూడా తనకు విశ్వాసాలున్నాయని…దాని వల్ల మీకేం నష్టమని… విమర్శించేవారికి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో విమర్శలు చేసిన మోడీకి కూడా ఇలాగే సమాధానం ఇచ్చారు. అయితే.. ముహుర్తాల కారణంగానే… మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతూ ఉంటే… కేసీఆర్‌ను ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే.. ఆయన వ్యక్తిగత విశ్వాసాల ప్రభావం పాలనపై పడుతోంది. కేసీఆర్ సన్నిహితులు చెబుతున్న మరో కారణం… శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామని చెబుతున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత.. ఇలాంటి కారణం చెప్పడం అంత సమంజసంగా ఉండదు. ఎందుకంటే.. ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి.. ఇప్పుడున్న శాఖలతో.. సంతృప్తికరంగా ఉన్నట్లే. ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే.. అంతకు ముందే వాటిని కలిపేసి ఉండేవారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసమా..?
ఇక మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడానికి టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న రాజకీయ కారణం కూడా ఉంది. అదే రాజకీయ వలసలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వస్తారని.. వారిలో ముఖ్యులు ఉంటే.. వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి విస్తరణ ఆపారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే… కాంగ్రెస్ బలం పన్నెండు కన్నా తక్కువకు పడిపోతుంది. అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీకిప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇప్పటికే.. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను… పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణ జరిపినా… పూర్తి స్థాయిలో చేయరని.. పార్లమెంట్ ఎన్నికల్లో చూపే ప్రతిభ ఆధారంగా ఎమ్మెల్యేలకు… మంత్రి పదవులిస్తారని చెబుతున్నారు. ఈ కారణాల్లో.. ఏ కారణం నిజమో మనకు తెలియదు. కానీ ఏ కారణం అయినా… కానీ… మంత్రివర్గం ఇంత కాలం లేకుండా ప్రభుత్వం నడపడం సమంజసం కాదు.