ఈ సంక్రాంతి బరిలో నిలిచిన రామ్‌చరణ్ చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సీజన్లో రాబోతున్న పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ సినిమా ఇది. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యు బై ఏ సర్టిఫికెట్తో బయటకు వచ్చింది. సంక్రాంతి సినిమా, అందులోనూ రంగస్థలం తరవాత చరణ్ నుంచి వస్తున్న సినిమా.. కాబట్టి తిరుగులేని ఓపెనింగ్స్తెచ్చుకోవడం ఖాయం. మెగా ఫ్యాన్స్, కుర్రాళ్లూ ఎగబడతారు. కాకపోతే.. ‘రంగస్థలం’లా కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈసినిమాకి దక్కుతుందా, లేదా? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.
టీజరు, ట్రైలర్లలో.. మాస్,యాక్షన్ పాళ్లు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరణ్ చొక్కా విప్పి, గన్ను పట్టి మరీ భీకరమైన పోరాటలు చేస్తున్నాడు. ఇవన్నీ మాస్ ని మురిపించే అంశాలే. అయితే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అనేది అనుమానంగా మారింది. ఈ సినిమాలో యాక్షన్ డోసు మరీ ఎక్కువగా ఉందని, ద్వితీయార్థంలో హింస, రక్తపాతం ఏరులై పారుతుందన్నది సెన్సార్ రిపోర్ట్. అదే.. కాస్త ఇబ్బంది కలిగించే విషయం. అలాంటి సన్నివేశాలు మాస్ మెచ్చినా.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరం చేస్తుంటాయి. ‘రంగస్థలం’లా ‘వి.వి.రా’ కూడా రికార్డులు సృష్టించాలన్నా, జరిగిన బిజినెస్‌కి తగిన వసూళ్లు సాధించాలన్నా.. కుటుంబ ప్రేక్షకుల మద్దతు కావాల్సిందే. యాక్షన్‌ని నమ్ముకున్న ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏమాత్రం నచ్చుతుందన్నది బాక్సాఫీసు రిజల్టే తేల్చి చెప్పాలి.