‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం నందమూరి బాలకృష్ణ కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వాడారు. అందులో కళ్లజోడు, కుర్చీ ప్రధానమైనవి. వాటికో విశిష్టత ఉంది. అవి.. ఎన్టీఆర్ వాడిన వస్తువులు. వాటిని ఈ సినిమాలో బాలయ్య వాడారు. షూటింగ్లో వాడిన వస్తువుల్ని కాస్ట్యూమ్స్‌నీ, ఆఖరికి కార్లనీ… కూడా దాచుకోవడం అలవాటు. అలా దాచుకున్న వస్తువుల్లో కొన్ని బయోపిక్‌లో చూపించాలని బాలయ్య భావించారు. పౌరాణిక చిత్రాల్లో వాడిన కాస్ట్యూమ్స్.. అంటే గద, కిరీటం లాంటి వస్తువుల్ని ఈ సినిమాలో వాడుకోవాలని అనుకున్నప్పటికీ అవి మరీ శిధిలావస్థకు చేరుకున్నాయి. అందుకే ఆ మోడల్స్‌ని దృష్టిలో ఉంచుకుని… మళ్లీ కొత్త ఆభరణాల్ని తయారు చేయించారు. అయితే కళ్లజోడు, కుర్చీ మాత్రం వాడుకోవడానికి వీలుగా ఉండడంతో… ఈ సినిమాలో వాటిని చూపిస్తున్నారు.
”నాన్నగారు దాచుకున్న వస్తువుల్లో చాలామట్టుకు శిధిలావస్థకు చేరుకున్నాయి. ఇంకొన్ని ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. మాకు అందుబాటులో ఉన్నవి కళ్లజోడు, కుర్చీ మాత్రమే” అని నందమూరి బాలకృష్ణ కూడా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ‘కథానాయకుడు’ ఈ నెల 9న రాబోతోంది. ఫిబ్రవరి 6న ‘మహానాయకుడు’ విడుదలకు సిద్ధమైంది.