ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… రాజకీయ దిగ్గజమే. ప్రజాబలంతో కాకపోయినా.. తనదైన నాయకత్వ లక్షణాలతో.. ఆయన ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన కొత్త తరం రాజకీయాలకు అలవాటు పడలేదు కాబట్టే.. ఆయనను … భారతీయ జనతా పార్టీ ద్వయం నరేంద్రమోడీ, అమిత్ షా విజయవంతంగా… ప్రమోషన్ ఇచ్చి పక్కన పెట్టేశారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఉందని.. ఎంతగా మొత్తుకున్నా.. రాజ్యసభ చైర్మన్‌గా మీరు ఎంతో కీలకం అంటూ… గుజరాత్ ద్వయం… వెంకయ్యను సాగనంపారు. వెంకయ్యకు ఏమి జరిగిందో మొత్తం తెలిసినా.. ఆయన కొత్త తరహా రాజకీయాలను ఒంట బట్టించుకోలేకపోయారు. తాజాగా విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన… కొన్ని కామెంట్లు చేశారు. ” మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కొందరు నాయకులకు నోరు జారడం అలవాటైందని, అలాంటి వారు జారిపడటం ఖాయమ”ని వ్యాఖ్యానించారు.
వెంకయ్యనాయుడు చెప్పినవి చాలా మందికి.. సెన్సార్డ్ పదాల్లా అనిపించాయంటే.. అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో భాష గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. రాజకీయభాషా ప్రమాణాలు కొత్త కొత్త శిఖరాలకు చేరుతూనే ఉంది. ఇందులో.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడా లేదు. కొద్ది రోజల క్రితం.. తెలంగాణ సీఎం కేసీఆర్… పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకప్పటి తన రాజకీయ గురువు అయిన చంద్రబాబును.. అత్యంత దారుణంగా దుర్భాషలాడారు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది…? కేసీఆర్ అన్నారు కాబట్టి… తెలంగాణలో వ్యతిరేకించేవారు ఎవరూ ఉండరు. ఏపీలో.. కేసీఆర్ పై గెలుపు భారం వేసిన పార్టీలు, వారికి సంబంధించిన మీడియా కూడా.. ఆ లాంగ్వేజ్‌ను సమర్థించేసింది. అంతేనా.. అది అలా ఉండగానే… ఈ భాషా ఉద్యమంలోకి ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చారు. ఏపీ కార్యకర్తలతో యాప్ భేటీ పెట్టుకుని… అందులో అందరూ చంద్రబాబును తిడుతూంటే.. మనసారా ఆస్వాదించారు. చిరునవ్వులతో సంతోషపడ్డారు.
సోము వీర్రాజు అనే నేత చంద్రబాబును “లుచ్చా.. ” అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే… ప్రధాని మోడీ హాయిగా నవ్వుతూ కనిపించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఓ ముఖ్యమంత్రిని తమ పార్టీ నేత… తాగుబోతు మాదిరి తిడుతూ ఉంటే… చక్కగా నవ్వుతున్నారు. అంటే ప్రొత్సాహం ఇచ్చినట్లేకదా..! అందుకే మిగిలిన నేతలూ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు… అధికారంలో ఉన్నారు కాబట్టి… అటు కేసీఆర్.. ఇటు మోడీ… భాషోద్యమం చేస్తున్నారనుకోవాలి. ఇది రాజకీయాల్లో వస్తున్న మార్పు అనుకోవాలి. కానీ వెంకయ్యనాయుడు.. పాత కాలం రాజకీయ నాయకుడు. “నాయకులకు నోరు జారడం అలవాటైందని, అలాంటి వారు జారిపడటం ఖాయమ”నుకుంటున్నారు. జారిపడబోరండి వెంకయ్యగారూ.. వారే విజేతలు..! ఇప్పుడు జరుగుతున్న నిజం ఇదే..! ఎంత ఎక్కువ నోరు జారితే.. అంత పెద్ద నేతన్నమాట…!