ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రంతో పోరాటంపై ఏపీ ఎంపీలతో సమావేశమై చర్చిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలతోపాటు, పోలవరం నిధులు, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన ఆర్థిక సాయంపై చేయాల్సిన పోరాటానికి కూడా ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తారు. దీంతోపాటు, చంద్రబాబు ఢిల్లీ టూర్ లో మరో కీలకమైన అంశం మహా కూటమి కార్యాచరణపై పలువురు నేతలతో భేటీ అయి చర్చించబోతుండటం.
భాజపా వ్యతిరేక పార్టీలతో ఆయన భేటీ అవుతారు. దీన్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా మరో ఆరుగురు కీలక నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లాను కూడా కలుసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. నిజానికి, డిసెంబర్ లో జరిగిన మహా కూటమి సమావేశానికి కొనసాగింపుగానే తాజా సమావేశం జరుగుతోంది. దీన్లో ప్రధానంగా… లోక్ సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీల సభలూ సమావేశాలూ పెద్ద ఎత్తున నిర్వహించే అంశమై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల నుంచే మహా కూటమి సభలు, ర్యాలీలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తారని అంటున్నారు. రాబోయే నెలలో కూటమి చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఖరారు చేస్తారని సమాచారం.
ఎన్డీయే వైఫల్యాలను నిరసిస్తూ, దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ఉద్దేశంతో మహా కూటమి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పార్టీలను ఏకతాటి మీదికి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో… ఎన్డీయే వైఫల్యాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేయాలన్నదే కూటమి తాజా కార్యాచరణగా ఉంటుందని చెప్పొచ్చు. నిజానికి, పశ్చిమ బెంగాల్ లో భారీ ర్యాలీ నిర్వహించాలనీ గతంలో అనుకున్నారు. అమరావతిలో కూడా భాజపా తీరుకి వ్యతిరేకంగా జాతీయ నేతలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టాలని భావించారు. ఎనిమిదిన జరిగే మీటింగ్ లో ఇలాంటి నిరసనలకు సంబంధించిన తేదీలను దాదాపు ఫిక్స్ చేస్తారనే అభిప్రాయమే వినిపిస్తోంది.