ఆదివారం ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ అనే టీవీ చానల్.. ఓ సర్వేను ప్రకటించింది. ఆ సర్వే ప్రకారం.. ఏపీలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 19 స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ఇలాంటి ఫలితాలొచ్చప్పుడు సాక్షి పత్రిక ఏం చేస్తుంది..? . మిగతా సర్వే విషయాల సంగతేమైనా కానీ… మొదటి పేజీలో బ్యానర్‌గా రాసుకుంటుంది. వైసీపీ ఎంత బాగా ప్రజల్లోకి వెళ్లిందో చెబుతుంది. జగన్ జననాయకుడు ఎలా అయ్యారో వివరిస్తుంది. కానీ… ఈ సారి అలా జరగలేదు. సర్వే గురించి ఎక్కడో లోపల పేజీల్లో కవర్ చేశారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన దాదాపుగా లేదు. ఒక్క చోట మాత్రం వైసీపీకి 19 స్థానాలు వస్తాయని.. కనిపించి.. కనిపించకుండా రాసి వదిలేశారు.
వైసీపీ భారీ విజయం సాధించబోతోందన్న ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ కవరేజీని సాక్షి ఇంత తేలిగ్గా తీసుకోవడం కారణం.. నమ్మశక్యంగా లేకపోవడమేనని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ సర్వేలో వైసీపీకి ఏకంగా 19 స్థానాలు ఇచ్చిన ఇండియా టీవీ .. కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న వారెవరికైనా… ఏపీలో ఏ స్థానంలో అయినా కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ వస్తుందన్న విషయాన్ని కూడా అంగీకరించరు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ పార్టీకి బలమైన నేతలు ఎవరూ లేరు. క్యాడర్ కూడా లేదు.
ఇటీవలి కాలంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ నిర్వహించిన ఏ ఒక్క సర్వే కూడా.. నిజ ఫలితాలకు దరి దాపుల్లో లేదు. ఈ కారణంగా కూడా… సాక్షి పత్రిక ఆ సర్వేకు ప్రాధాన్యం ఇచ్చినా.. జాతీయ రాజకీయాల వరకే దృష్టి పెట్టింది కానీ.. ఏపీ వరకూ రానీయలేదు. తెలుగు మీడియాతో మాత్రం టచ్ మి నాట్ అన్నట్లుగా ఉండే… జగన్మోహన్ రెడ్డి.. జాతీయ మీడియా పేరుతో.. కొంత మంది జర్నలిస్టులకు మాత్రం సన్నిహితంగా వ్యవహరిస్తూం ఉంటారు. ఆయన ట్విట్టర్లో అనుసరించే తొమ్మిది మందిలో … ప్రశాంత్ కిషోర్‌తో కాకుండా మిగిలిన వాళ్లంతా.. జాతీయ మీడియా ప్రముఖులే. వారిలో ఇండియా టీవీ చైర్మన్ రజత్ కపూర్ కూడా ఉన్నారు. వైసీపీ కోసం… ప్రశాంత్ కిషోర్.. జాతీయ మీడియాలో తన పరిచయాల్ని వాడి.. ఇలాంటి సర్వేలు వచ్చేలా చూస్తూంటారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి.