రాజకీయ రంగ ప్రవేశం కోసం ఉబలాట పడుతున్న అలీకి.. చాలా పెద్ద టార్గెట్లే పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాతో పెద్దగా మాట్లాడని.. అలీ.. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాత్రం… తన ఆశలు అన్నీ వెళ్లబోసుకున్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సరిపోదని… మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనంటున్నారు. అలా ఇచ్చే పార్టీలో చేరతానని..తనకు దాపరికాలు ఏమీ లేవంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంపై అలీ కన్ను ఉంది. అక్కడ… ముస్లిం జనాభా ఎక్కువ. ఎప్పుడూ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. తనకు అక్కడ సీటు ఇచ్చి .. మంత్రి పదవి కూడా ఇవ్వాలంటున్నారు. ఏ పార్టీ ఇలా ఇస్తే ఆ పార్టీలో చేరిపోతానంటున్నారు.
అలీ .. తన లక్ష్యాన్ని జేబులో పెట్టుకుని మూడు పార్టీల వద్దకు ఇప్పటికే పరుగులు పెట్టారు. కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. జనవరి 9వ తేదీన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆదివారం.. అశ్వనీదత్ తో కలిసి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ నేతలు షాక్ కు గురయ్యారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన అలీ.. పవన్ కల్యాణ్‌తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారని, అలీ జనసేనలో చేరడం ఖాయమని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి.
మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు.. ఆయన ఆశిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యేలను తొలగించి.. గుంటూరుకు ఎలాంటి సంబంధం లేని.. అలీకి జగన్ టిక్కెట్ ఇస్తారా..? అనేది కీలకం. అలాగే.. టీడీపీ అధినేత కూడా.. పార్టీకి పని చేయని వాళ్లను టిక్కెట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇప్పుడు అలీకి ఎక్కువగా టిక్కెట్ వచ్చే అవకాశాలు జనసేలో ఉన్నాయి. మరి అలీ ఏ నిర్ణయం తీసుకుంటారో..?