ఆర్థికంగా అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు అనే అంశంపై.. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందన్నదానిపై రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే.. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అనే విషయంలో మాత్రం రాజకీయ పార్టీలన్నీ పూర్తి క్లారిటీతో ఉన్నాయి. ఎన్నికల ప్రకటన మరో 30, 40 రోజుల్లో వస్తుందనగా… ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాలకు పది శాతం .. రిజర్వేషన్ల బిల్లు ఎలా పాస్ చేస్తారని.. కాంగ్రెస్ సహా.. ఇతర పక్షాల నేతలందరూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం.. రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు. ఇప్పటికి 49.5 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇంత కంటే.. ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలంటే.. కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే.. ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం.
లోక్ సభ లో బిల్లును మంగళవారం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును పాస్ చేయడానికి రెండు రోజుల పాటు.. సమావేశాలు పొడిగిచాలని అనుకుంటున్నారు. లోక్ సభలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం.. చూస్తే ఎన్డీఏ బలం కూడా.. సరిపోదు. కానీ…అగ్రవర్ణ ఓటు బ్యాంకులపై ఆధారపడిన పార్టీలు మాత్రం మద్దతు పలికే అవకాశాలు ఉండొచ్చు. ఆ కారణంగా.. లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లును పాస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం.. బిల్లు అంత తేలిగ్గా ఆమోదం పొందదు. రాజ్యసభలో .. ఎన్డీఏకు సాధారణ మెజార్టీ కూడా లేదు. అందుకే… ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించుకోలేక పెండింగ్ లో పెట్టారు. ఇక .. అక్కడ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లు పాస్ కావాలంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యమనే రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఏ విధంగా చూసినా… ఎన్నికల ప్రకటన వెలువడేలోపు… ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ కావడం… రాజ్యాంగసవరణ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ మోడీ మాత్రం రాజకీయ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు. తాను ఉన్నత కులాల్లోని పేదల కోసం… రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసినా.. విపక్షాలు అడ్డుకున్నాయని.. మళ్లీ అధికారంలోకి రాగానే ఇస్తానని ఆయన చెప్పుకుని….ఓట్ల వేటకు బయలు దేరవచ్చు. అసలు ప్లాన్ ఇదే అనడానికి..ఎన్నికల ప్రకటనకు.. నలభై రోజుల ముందు నిర్ణయం తీసుకోవడమే కారణం అంటున్నారు. అంటే ఏ విధంగా చూసినా.. ఇది అగ్రవర్ణాల పేదలపై కనికరం మాత్రం కాదు… మళ్లీ అధికారంలోకి రావాలనే తాపత్రయమే..!