అటు వైకాపాకీ ఇటు జనసేనకూ మధ్య ఊగిసలాడుతున్నాడు అలీ. ఇటీవల అలీ వైకాపాలో చేరినట్టు వార్తలు రావడం, ఆ వెంటనే.. అలీ పవన్నీ, చంద్రబాబు నాయుడినీ కలుసుకోవడం తెలిసిన విషయాలే. ఈ కలయిక మరింత ఆసక్తిని, మరిన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అసలు అలీకీ, పవన్‌కీ మధ్య ఏం జరిగింది? వారిద్దరూ కలుసుకుని ఏం మాట్లాడుకున్నారు? అనే విషయాలు ప్రస్తుతం టాలీవేడ్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
అలీ పవన్ మధ్య అనుబంధం తెలియంది కాదు. ‘అలీ నా గుండె కాయ.. తను లేకపోతే సినిమాలు చేయలేను’ అని పవన్ స్వయంగా చెప్పాడు. అలీ కూడా పవన్ గొప్పోడని, నిజాయతీపరుడని చాలా సందర్భాల్లో చెప్పాడు. అలీ జనసేనలో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో.. అలీ అటు ఓ కాలు, ఇటు ఓ కాలు పెట్టడం గందరగోళానికి తావిస్తోంది. అలీ పవన్‌ని కలుసుకుని ఏం మాట్లాడాడు? వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది? అనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం… అలీ, పవన్ లమధ్య పార్టీ పరమైన చర్చలేం జరగలేదని తెలుస్తోంది.
తాను వైకాపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పడానికే అలీ పవన్‌ని కలిశాడట. అయితే `జనసేనలోకి వస్తా` అని అలీ గానీ, `జనసేనలోకి రావాలి` అని పవన్ గానీ చెప్పలేదని తెలుస్తోంది. ‘నీకు ఎలా నచ్చితే అలా చేయ్.. నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని పవన్ చెప్పినట్టు సమాచారం. పవన్ ఆహ్వానిస్తే ఇప్పటికిప్పుడు జనసేనలోకి చేరడానికి అలీ సిద్ధంగా ఉన్నాడని, అయితే పవన్ నుంచి అలాంటి పిలుపేం రాలేదని అలీ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ ఇప్పటి వరకూ ఎవరినీ ‘నా పార్టీలోకి రా’ అని నోరు తెరచి అడగలేదు. అలాంటిది అలీని మాత్రం ఎందుకు అడుగుతాడు. ఈ చిన్న లాజిక్‌ని అలీ ఎలా మిస్సయ్యాడో..?