అమ్మోరు లాంటి భక్తి ప్రధాన చిత్రాలు వచ్చినప్పుడు, అవి బాగా ఆడుతున్నప్పునడు.. థియేటర్ల దగ్గర దేవతల బొమ్మలు, విగ్రహాలు పెట్టి.. థియేటర్లని దేవాలయాలుగా మార్చేశారు అప్పట్లో. అది బాగా వర్కవుట్ అయ్యింది. అదేదో సినిమాకి వస్తున్నట్టు కాకుండా.. జాతరకు వస్తున్నట్టో , అమ్మవారి దర్శనానికి వెళ్తున్నట్టో సెంటిమెంట్‌గా ఫీలైపోయారు తెలుగు ప్రేక్షకులు. థియేటర్ దగ్గర హుండీలు నెలకొన్నాయి. తీర్థ ప్రసాదాలు ఇవ్వడం మొదలయ్యాయి. హారతులు, కొబ్బరి కాయలు మామూలే. మొత్తానికి `అమ్మోరు”ఓ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది.
ఇప్పుడు ‘ఎన్టీఆర్’ కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతోంది. ఈనెల 9న `ఎన్టీఆర్` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శించే వంద థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ప్రతిష్టించబోతున్నారు. సినిమా ఆడినన్ని రోజులు ఆ విగ్రహం థియేటర్ ఆవరణలోనే ఉంటుంది. ఇప్పటికే విగ్రహాల తయారీ పూర్తయింది. వంద థియేటర్లని ఎంపిక చేయడం కూడా జరిగిపోయింది. థియేటర్‌కి వచ్చిన నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలు చూసి, పూనకాలతో ఊగిపోతారన్నది చిత్రబృందం ఆలోచన. సెంటిమెంట్‌గా ఇలాంటి ప్రయత్నాలు బాగానే వర్కవుట్ అయ్యే ఛాన్సుంది. కాకపోతే… వ్యక్తిపూజ అనేది తమిళనాట ఎక్కువగా సాగుతుంది. అక్కడ ఇలాంటి ప్రయత్నాలకు, ప్రయోగాలకు ఫ్యాన్స్ పడిపోతారు. ఇది వరకు తెలుగులోనూ ఇలాంటి వాతావరణమే ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమాని సినిమాగానే చూడడం మొదలెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో విగ్రహాల ఆలోచన `ఎన్టీఆర్`కి ఎంత వరకూ అదనపు ప్రయోజనాన్ని తీసుకొస్తుందో చూడాలి.