ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక రేంజ్ లో వేడెక్కుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుదే 2019 లో మళ్ళీ అధికారం అని అనుకున్నవాళ్లంతా 2018 మార్చి 14 న పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్న తర్వాత కొంత సందిగ్ధంలో పడిపోయారు. జగన్ బలం గా ఉన్నాడని, ఈసారి అధికారంలోకి వస్తాడని అంచనా వేస్తున్న వైఎస్ఆర్సిపి అభిమానులు కూడా చివరికి వచ్చేసరికి “పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడాలి” అంటూ ముక్తాయిస్తున్నారు. జనసేన అభిమానులు మాత్రం తమ పార్టీ లో కాకలు తీరిన నాయకులు లేకపోయినా, చానళ్లు పత్రికల మద్దతు తమకి లేకపోయినా, జనసేన పార్టీ గెలుపు అవకాశాలు మీద గట్టి అంచనాలే పెట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ పార్టీ మీద ఇప్పటివరకు ఉన్న ప్రధాన విమర్శ – పార్టీలో గొప్ప లీడర్లు లేరు అని, పార్టీకి బలమైన క్యాడర్ లేదు అని. అలాగే పార్టీకి ఉన్న అనుకూలతల విషయానికి వస్తే పవన్ కి అండగా ఉన్న యువత, అభిమానులు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీకి బలాలు అని చెబుతూ వస్తున్నారు. మరి ఇంతకీ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.
పార్టీ క్యాడర్ ఆర్మీ అయితే, మీడియా నావీ అయితే, సోషల్ మీడియా ఎయిర్ ఫోర్స్
ఒకప్పుడు యుద్ధాలు పూర్తి గా నేల మీద పోరాడే సైనికుల మధ్య జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాజ్యాలు బలమైన నావికాదళాలను ఏర్పరచుకొని యుద్ధం జరిగే తీరునే మార్చేశాయి. దాంతో సైన్యం బలంగా లేకపోయినా యుద్ద నౌక లతోనే కొన్ని రాజ్యాలు గెలుపు సాధించాయి. ఆ తర్వాత వచ్చిన యుద్ధ విమానాలు అసలు యుద్ధం జరిగే స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశాయి. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయాన్ని కూడా యుద్ధకళ గా సంబోధిస్తూ ఉంటారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకున్నప్పుడల్లా ఆ పార్టీ బలంగా పుంజుకోవడానికి కారణం ఆ పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి క్యాడర్ . ఇందాకటి ఉపమాన రీతిలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి నేల మీద సైన్యం బలంగా ఉందన్న మాట. ( తెలంగాణ విభజన అనంతరం పరిస్థితులు మారిపోయాయి అనుకోండి అది వేరే విషయం). అయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి కూడా కాంగ్రెస్ తో సమానమైన క్యాడర్ ఉన్నప్పటికీ అది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో పార్టీకి ఏర్పడిందే. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా నావికాదళం లాంటి మీడియా మీద ఫోకస్ చేస్తూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం, కూటములు ఏర్పరచడం, మీడియాలో తమ పార్టీ మరియు తమ నాయకులు ఏ విధంగా ప్రొజెక్ట్ కావాలో కసరత్తు చేసి మరీ ఆ విధంగా ప్రొజెక్ట్ అయ్యేలా చూడడం, తాము చేస్తున్న పనులకు మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయడం, జాతీయ మీడియాలో సైతం తన గురించి మాట్లాడేలా కార్యక్రమాలను డిజైన్ చేయడం- వీటి మీద చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించే నాటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తదనుగుణంగా పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ కూడా సోషల్ మీడియా మేనేజ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జనసేన సోషల్ మీడియా శతఘ్ని మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే చాలా చురుగ్గా, చాలా బలంగా తమ వాదనను వినిపిస్తూ ఉంది అన్నది కాదనలేని వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే టిడిపి వైఎస్ఆర్సిపి ల కంటే సోషల్ మీడియాలో జనసేన పార్టీ బలంగా ఉంది. అంటే ఇందాకటి ఉపమానరీతిగా మళ్లీ చెప్పాలంటే, జనసేన ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిందన్నమాట. అయితే సోషల్ మీడియాలో బలంగా ఉంటే సరిపోతుందా అన్నది మరొక ప్రశ్న.
సాక్షి ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామన్న జగన్
జగన్ ఈమధ్య టీవీ 9 కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయింది. సాక్షి ఛానల్ లో జగన్ ఇంటర్వ్యూలను స్కిప్ చేసే వారు సైతం టీవీ9 లో వచ్చిన ఇంటర్వ్యూను ఆద్యంతం తిలకించారు. అయితే ఈ ఇంటర్వ్యూ లో- జగన్ మీద మొండి వాడు అని, ఇంకా అలాంటి మరికొన్ని అపప్రధలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించినప్పుడు, జగన్ సమాధానమిస్తూ, చంద్రబాబుకు రెండు పత్రికలు మరో నాలుగైదు ఛానల్ లు మద్దతుగా ఉన్నాయని, తమకు కేవలం ఒక్క సాక్షి పత్రిక, చానల్ మాత్రమే ఉందని, ఆ సాక్షి తో ఎంతకని పోరాడతామని, అక్కడికి గ్రామాల్లో తమ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తిప్పి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. అంటే సాక్షి చేయలేని పని సోషల్ మీడియా చేస్తోందని ఆయన అంగీకరించారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా నిన్న మాట్లాడుతూ, మీడియాలో తాము చేస్తున్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు కాబట్టి తాను కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేస్తున్నా అని ప్రకటించారు. ఈ లెక్కన మీడియాలో వచ్చే కథనాలకు సోషల్ మీడియా ఏ రేంజ్ లో కౌంటర్ ఇస్తుందో అర్థం అవుతోంది.
ఆ మధ్య ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మూడు గంటల పాటు నిర్వహించే ఒక రాజకీయ బహిరంగ సభ కన్నా, 30 సెకండ్ల నిడివిగల ప్రభావవంతమైన వీడియో ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహ కర్త గా తిరుగులేని విజయాన్ని సాధించిన ప్రశాంత్ కిషోర్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. వైఎస్ఆర్ సీపీ నాయకుల వాదన లు, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చూస్తే సోషల్ మీడియాలో జనసేన బలంగా ఉండటం అన్నది ప్రత్యర్థి పార్టీ లకు ఎంత ఇబ్బంది కరమైన అంశమో అవగతమవుతుంది.
క్యూరియస్ కేస్ ఆఫ్ కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గాన్ని మినీ ఆంధ్ర గా సంబోధిస్తారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కూకట్పల్లిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేసిన రోడ్ షోలు, ర్యాలీలు – చూసిన జనాలను ముక్కున వేలేసుకునేలా చేశాయి. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో ఇంత బలమైన క్యాడర్ ఇప్పటికీ ఉందా అని ఎంతోమంది ఆశ్చర్యపోయేలా, ట్రాఫిక్ జామ్ లు అయ్యేలా తెలుగుదేశం ర్యాలీలు జరిగాయి. అయితే రోడ్డుమీద పరిస్థితి ఇలా ఉంటే, సోషల్ మీడియాలో పరిస్థితి మరోలా ఉంది. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పే వాదనలను సోషల్ మీడియాలో విపరీతంగా అప్లోడ్ చేశారు తెలుగుదేశం వ్యతిరేకులు. ‘కూకట్పల్లిలో ఇద్దరు తెలుగుదేశం సామాజికవర్గ వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ’ అంటూ లీకైన ఆడియో ఎంత వైరల్ అయిందో స్థానికులకు తెలుసు. అసలు ఆ ఆడియో నిజమా లేక నకిలీయా తెలియదు కానీ ఆ ఆడియో తెలుగుదేశం పార్టీకి కూకట్పల్లి ఎన్నికల్లో చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇలాంటివి కోకొల్లలు. ఇక సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి అభిమానులు, జనసేన అభిమానులు బహిరంగంగానే టిఆర్ఎస్ కు మద్దతు పలికారు. వైయస్సార్సీపి సంగతి ఏమో కాని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాత్రం ఇటీవల వెళ్లి చిరంజీవిని నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా కలిసి వచ్చారు. పైకి , విషెస్ చెప్పడానికి మాత్రమే వచ్చానని చెబుతున్నప్పటికీ, ఎన్నికల సందర్భంగా మెగా బ్యాచ్ తనకు ( పరోక్షంగా, సోషల్ మీడియాలో) మద్దతు పలికినందుకే ఆయన వెళ్లాడని రూమర్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియా వల్ల మాత్రమే కూకట్పల్లిలో గెలుపు సాధ్యమైందని చెప్పడం ఉద్దేశం కాదు గాని, సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఖచ్చితంగా ఒక ఉదాహరణ.
80% కాపు సామాజిక వర్గం జనసేన తోనే అంటున్న బిజెపి మాజీ మంత్రి
మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆమధ్య చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కాపు సామాజికవర్గంలో 80% ప్రస్తుతం జనసేన తోనే ఉందని, 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కనీసం 50 శాతం కూడా కాపులు చిరంజీవి వెంట నడవలేదని ఆయన వ్యాఖ్యానించాడు. మాణిక్యాలరావు ఏ గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ, ఒకవేళ ఇదే గనుక నిజమైతే కనీసం 20 శాతం ఓటు బ్యాంకు జనసేనకు ఇప్పటికే ఉన్నట్టు.
మొత్తం మీద:
జనసేన పార్టీని అయోమయం పార్టీ అనో, లీడర్లు, కేడర్ లేని పార్టీ అనో ప్రత్యర్థులు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ, జనసేన పార్టీ సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని చాప కింద నీరులా విస్తరిస్తోంది. సామాజిక సమీకరణలు కలిసిరావడం, సరైన నేతలు దొరకడం అలాంటివి తోడైతే జనసేన ప్రభావం చాలామంది ఊహిస్తున్న దానికంటే ఎక్కువ గానే ఉండే అవకాశం కనిపిస్తోంది
– జురాన్