ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగింపునకు వచ్చింది. ఈ నేపథ్యంలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాన్ని సాక్షి పత్రిక ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలో విజయమ్మ చెప్పిన సమాధానాల సంగతి అలా ఉంచితే, కొమ్మినేని అడిగిన ప్రశ్నలు భలేగా ఉన్నాయండి! ‘జనం చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్ముతారా, జగన్ చెప్పే నిజాలు నమ్ముతారా..? జగన్ లో ఉన్న గొప్ప లక్షణాల గురించి ఏమంటారు..? మంచి వారికి రాజకీయాలు పనికొస్తాయా..? మీ ప్రత్యర్థి చంద్రబాబును ఎదుర్కొనే సత్తా మంచి తనానికి ఉందా..? జగన్ పాదయాత్రకు గండి కట్టే ప్రయత్నాలు జరిగాయంటారా..?’… ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. రాబట్టాల్సిన సమాధానాలు ప్రశ్నల్లోనే ఉన్నాయిగా.
ఇక, ఇంకో ప్రశ్నకి వస్తే… నాడు కొత్తగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సన్నివేశాల్నీ, నేడు జగన్ సన్నివేశాల్నీ కొందరు పోలుస్తున్నారనీ, దీనిపై ఏమంటారంటూ విజయమ్మను కొమ్మినేని ప్రశ్నించారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే… ఎన్టీ రామారావు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారూ, తొమ్మిది నెలలంటే ఏమంత కష్టం కాదు, జగన్ కి ఉన్న సమస్యలు ఎన్టీఆర్ కి లేవు, జగన్ రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిదేళ్లయింది, జగన్ కి ఉన్న కష్టాలు, ఇబ్బందులూ ఆయనకి లేవు, అన్నీ ఉన్నా కూడా వాటిని అధగమించుకుని జగన్ ముందుకు వెళ్తున్నాడని చెప్పారు.
నాడు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి అధికారంలోకి తీసుకురావడానికీ, నేడు జగన్ పార్టీ పెట్టడానికీ పోలిక ఎక్కడుంది..? అది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ నిలబడ్డ సందర్భం, ఇది కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం నిలుస్తున్న సందర్భం. ఆ సందర్భాన్నీ ఈ సందర్భాన్నీ ఒకేలా ఎవరైనా చూస్తారా..? ఎన్టీఆర్ ప్రజాదరణతో జగన్ కు ఉన్న ఆదరణను ఒకటే అన్నట్టుగా ఎవరైనా సరిపోలుస్తారా..? కొమ్మినేని ప్రశ్న అడగడమే ఒకెత్తు అనుకుంటే… దానికి విజయమ్మ సమాధానం మరో ఎత్తు! పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తేవడం చాలా సులువైన పని అన్నట్టుగా ఆమె మాట్లాడేశారు. ఎన్టీఆర్ కి జగన్ లా కేసులు లేవనీ, ఆయనకి అలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్లనే అధికారంలోకి ఈజీగా వచ్చేశారన్నట్టుగా చెప్పడం మరీ విడ్డూరం. ఎన్టీఆర్ కంటే జగన్ చాలా కష్టపడుతున్నాడని అనేయడం మరీ అతి! ఒక ప్రశ్న అడిగే ముందు అది సందర్భోచితంగా ఉంటుందా లేదా, విన్నవారు నవ్వుతారా లేదా అనేది ఆలోచించాలి. దానికి సమాధానం చెప్పేవారైనా… ఇది ఎంతవరకూ నమ్మశక్యంగా ఉందనే విజ్ఞత ప్రదర్శించాలి. ఈ రెండూ లేనప్పుడు.. ఇదిగో ఇలానే విషయం నవ్వుల పాలౌతుంది అవుతుంది.