వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి… తాను వద్దనుకున్న నేతల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ విషయంలో ఆయన వ్యవహారశైలి పార్టీలోని నేతల్నే ఆశ్చర్య పరుస్తోంది. ఇచ్చాపురంలో ముగియనున్న పాదయాత్రకు.. పార్టీకి చెందిన నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు అనదగ్గ వారందరికీ ఆహ్వానం పంపారు. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు… ముగింపు సభ సందర్భంగా ఇచ్చాపురంకు జనాన్ని తీసుకు రావాల్సిన టార్గెట్లను పెట్టారు. అందర్నీ పిలిచారు కానీ.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. వంగవీటి రాధాకృష్ణను పట్టించుకోలేదు. ఆయనకు కనీసం సమాచారం కూడా పంపలేదు.
విజయవాడకు చెందిన వైసీపీ చోటా నేతలందరికీ.. చివరికి.. గౌతంరెడ్డికి కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ… వంగవీటి రాధాకృష్ణను జగన్ నిర్లక్ష్యం చేశారు. నిన్నామొన్నటి వరకూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను అకస్మాత్ గా తొలగించి మల్లాది విష్ణుకు పదవి ఇచ్చారు. ఆయననే అభ్యర్తిగా ఖరారు చేశారు. అప్పట్నుంచి వంగవీటి రాధాకృష్ణ .. వైసీపీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. అయినా కానీ.. వైసీపీ తరుపున ఒక్కరు కూడా.. వంగవీటిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం పార్లమెంట్ సీటు ఇస్తామని విజయసాయిరెడ్డితో జగన్ కబురు పెట్టారని చెబుతున్నారు. కానీ.. జగన్ మాత్రం నేరుగా ఒక్క సారి కూడా ఫోన్ చేసి కూడా పలకరించలేదు. కనీసం.. పాదయాత్రలో ఉన్నప్పుడైనా కలవమని కూడా కబురు పెట్టలేదు.
వంగవీటి రాధాను వద్దనుకునే.. జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్న చర్చ పార్టీలో నడుస్తోంది. ఇంత కాలం తాను వైసీపీలో ఉన్నాను కాబట్టి… జగన్ తనకు టిక్కెట్ లేకుండా చేయరనే నమ్మకంతో వంగవీటి రాధా ఉన్నారేమో కానీ.. జగన్ మాత్రం ఆయననుపూర్తిగా మర్చిపోయారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. వంగవీటి రాధా… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఖచ్చితంగా వేరే పార్టీని చూసుకోవాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.