ఒక వారం రోజుల కిందట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని తమ పార్టీతో పొత్తు కు రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏదో ఒక సారి విలేకరుల సమావేశంలో పొరపాటున అన్నాడేమో అనుకుంటే, ఆ తర్వాత కుప్పం లో ఒక సభలో మళ్ళీ ఇదే తరహా ఆహ్వానాన్ని చంద్రబాబు పంపారు. అయితే పవన్ కళ్యాణ్ వామపక్షాలతో తప్ప జనసేనకు ఎవరితోనూ పొత్తు ఉండదని విస్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన తర్వాత కూడా మంత్రి నారాయణ జనసేనని పొత్తుకు ఆహ్వానిస్తూ మరొక ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు మీడియా వర్గాల్లో విస్తృతంగా చర్చింపబడుతున్న ఒక రూమర్ ఏమిటంటే, చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చింది మరెవరో కాదు పత్రిక అధిపతి అయిన ఏబీఎన్ రాధాకృష్ణ అని.
తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం, చంద్రబాబు నాయుడు ఏబీఎన్ రాధాకృష్ణ ను దూరంగా పెడితే తప్ప 2019 ఎన్నికల్లో సరైన ఫలితాలు రావని ఒక చర్చ జరిగిన విషయం తెలిసిందే (https://www.telugu360.com/te/chandrababu-naidu-its-time-to-avoid-abn-radha-krishna/) నిజానికి ఏబీఎన్ రాధాకృష్ణ వైఖరి వల్లే టిడిపి మోడీల మధ్య దూరం పెరగడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య దూరం పెరగడం జరిగాయని కొంతమంది అంటూ ఉంటారు. రాధాకృష్ణ ఇచ్చే తప్పుడు సలహాలు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తున్నాయని వారి వాదన.
అయితే ఇప్పుడు మీడియా వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ ప్రకారం రాధాకృష్ణ చేయించుకున్న అంతర్గత సర్వేల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కారణంగా, పవన్ కళ్యాణ్ ని కలుపుకొని పోతే తప్ప వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అని రాధాకృష్ణ చంద్రబాబుకు సలహా ఇచ్చారని, ఆ సలహా తర్వాతే, చంద్రబాబు ఒకడుగు ముందుకు వేసి స్వయంగా తానే పవన్ కళ్యాణ్ ని పొత్తుకు ఆహ్వానించాడని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తమతో వస్తే తమకు లాభమే అని, ఒకవేళ రాకపోయినా కూడా బిజెపితో పోరాటానికి రమ్మంటే పవన్ కళ్యాణ్ రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు అని విమర్శ చేయవచ్చని రాధాకృష్ణ బాబుకు సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
అయితే, పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పొత్తు ప్రతిపాదన ను తిరస్కరించడం తో, ఇప్పుడు ఎటువంటి పొత్తు లేకుండా తమకు తాము సొంతంగా గెలవలేమనే సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లు అయిందని కొంతమంది తెలుగుదేశం నేతలు వాపోతున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ రాధాకృష్ణని, ఆయన సలహాలను దూరం పెట్టకపోతే ఇటువంటి పొరపాట్లు మరిన్ని జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.