బాలకృష్ణ గత ఏడాది రోజులుగా అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ ని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి, జనసేన ని ఉద్దేశించి చేసిన దురుసు వ్యాఖ్యలకు నాగబాబు బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా బాలకృష్ణ ను ఉద్దేశించి సెటైర్లు వేయడం, బాలకృష్ణ గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు పదేపదే గుర్తు చేస్తూ వివరణ ఇవ్వడం చేసిన నాగబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు. ఒక షార్ట్ ఫిలిం ద్వారా బాలకృష్ణ మీద పంచులు పేల్చారు. నాగబాబు స్వయంగా నటిస్తూ తీసిన ఈ షార్ట్ ఫిలిం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ ఈ వీడియో లో ఏముందంటే,
నాగబాబు కారులో వెళ్తుండగా, రోడ్డుమీద ఒకతన్ని ఆడవాళ్లందరూ కలిసి చితకబాదుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఆడవాళ్లు అతన్ని చితకబాదుతూ ఉండడం చూసి ఎవరో ఏమిటో కనుక్కుందాం అనుకుంటాడు నాగబాబు. ఇంతలో అతనే నాగబాబు కారుకు అడ్డంగా వస్తాడు. కిందకు దిగి ఏంటి సమస్య అని ఆడవాళ్లను అడిగి, వాళ్లు చెప్పబోయే లోపే, ఇలా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పి ఆడ వాళ్ళను పంపించేస్తాడు నాగబాబు. ఇంతకీ ఏమైందని, ఎందుకు ఆ ఆడవాళ్లు నిన్ను చితకబాదుతూ ఉన్నారని ఆ యువకుడిని అడిగితే, ” ఏమీ లేదు సార్, పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా అని, ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని ఒక పెద్దాయన చెప్పినట్టు చేయబోయాను, దీనికే ఆడ వాళ్ళంతా నన్ను కొడుతున్నారు” అని అంటాడు. ఈ సమాధానం విని అవాక్కైన నాగబాబు అతని మళ్లీ ఆడవాళ్ళకి అప్పగించి చితకబాదమని చెబుతాడు.
ఆ మధ్య బాలకృష్ణ ‘ ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి’ అని నోరు జారి ఆనక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే కేంద్రంగా చేసుకొని బాలకృష్ణ ని టార్గెట్ చేసి నాగబాబు వీడియో చేయడం చూస్తుంటే, బాలకృష్ణ ఇప్పటివరకు వీరిపై చేసిన వ్యాఖ్యలకు నాగబాబు ఒక రేంజ్ లో ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు గా కనిపిస్తోంది.
– జురాన్
https://www.youtube.com/watch?v=wJf8Cgk0BAE&feature=youtu.be