Ntr Kathanayakudu, NTR Biopic sameeksha
తెలుగు360 రేటింగ్: 3/5
చరిత్ర తనలో చాలామందికి చోటిచ్చింది!
కానీ చరిత్రకే ఓ చోటిచ్చిన వాళ్లు అరుదుగా ఉంటారు. వాళ్లు చరిత్రలో కలసిపోరు. చరిత్రగా మారతారు. అలాంటి వాళ్ల జాబితా ఒకటి రాస్తే.. అందులో `ఎన్టీఆర్` పేరు కచ్చితంగా ఉంటుంది.
ఆ పేరు ఓ సంచలనం
ఆ అడుగు ఓ ప్రభంజనం.
అటు సినిమా.. ఇటు రాజకీయం రెండు రంగాల్లోనూ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన ఓ వ్యక్తి ప్రయాణం.. ఎన్టీఆర్.
ఇలాంటి జీవితాన్ని తెరపై చూపించాలనుకోవడంతోనే సగం విజయం దక్కేసింది. మిగిలిన సగం… ఆ కథని ఎంత వరకూ ఎగ్జిక్యూట్ చేశారు? అనేదానిపైనే ఆధార పడి ఉంది. ఎన్టీఆర్ కథలో మనకు తెలిసిన విషయాలు, తెలియని కోణాలు ఇంకెంత రసవత్తరంగా తెరపైకి తీసుకొచ్చాడో అని నందమూరి అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికుడు కూడా ఆసక్తిగా ఎదురుచూశాడు. ఇన్ని ఆశలు, అంచనాల మధ్య `ఎన్టీఆర్` వచ్చేసింది. `కథానాయకుడు`గా తెరపై ప్రత్యక్షమైపోయాడు నందమూరి బాలకృష్ణ,. మరి ఈ సినిమా ఎలా ఉంది?? `ఎన్టీఆర్`గా బాలయ్య ఏమాత్రం రాణించాడు? ఓ మహనీయుడి జీవిత కథ తెరకెక్కించడంలో క్రిష్ ఎక్కడ సక్సెస్ అయ్యాడు?
కథ
బెజవాడ లో సబ్ రిజాస్ట్రారర్‌గా పనిచేసే నందమూరి తారక రామారావు (నందమూరి బాలకృష్ణ) ఆ ఉద్యోగంలో ఇమడలేక రాజీనామా చేస్తాడు. తనకు నటనంటే చాలా ఇష్టం. నాటకాలలో ప్రవేశం ఉంది. బెజవాడలో ఓ నాటక ప్రదర్శన ఇస్తే… ఎల్.వీ ప్రసాద్ చూసి మురిసిపోయి, మద్రాస్ వస్తే. సినిమాల్లో అవకాశం ఇస్తా అని మాట ఇస్తారు. దాంతో భార్య బసవతారకం (విద్యాబాలన్) నగలు తీసుకుని… మద్రాస్ రైలెక్కేస్తాడు. అలా సినిమాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు..తొలి అవకాశాన్ని ఎలా సంపాదించాడు? నటుడిగా ఎలా ఎదిగాడు? స్టార్‌గా ఎలా మారాడు? ప్రజల కష్టాలు చూసి ఎలా చలించిపోయాడు. ఓ రైతు బిడ్డ, ఓ సబ్ రిజిస్టారర్… రాజకీయ ప్రస్థానం వైపు ఎలా అడుగులు వేశాడు? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలేంటి? అనేదే కథ.
విశ్లేషణ
జగమెరిగిన బ్రాహ్మణుడికి జంథ్యమేల…? అన్నట్టు … ఎన్టీఆర్ చరిత్ర తెలియంది కాదు. తెలుగు సినీ ప్రేమికుడికి, ముఖ్యంగా తెలుగువాడికి ఆయన జీవితం తెరచిన పుస్తకమే. అయితే.. తెలియని విషయాన్ని ఎంతైనా చెప్పొచ్చు. తిమ్మిని బమ్మిగా మార్చొచ్చు. తెలిసిన విషయాన్ని ఇంకాస్త ఆసక్తిగా చెప్పడంలోనే అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఆ సవాల్‌ని క్రిష్ స్వీకరించాడు. ఎన్టీఆర్ తొలి నాళ్ల ప్రయాణం, సినిమాల్లోకి రావడం, ఇక్కడ ఎదురైన ఆటుపోట్టు, అవకాశాల కోసం నిరీక్షణ.. ఇవన్నీ ఆసక్తికరంగా మలిచాడు. తొలి అవకాశం వచ్చిన విధానం, కృష్ణుడిగా మారిన వైనం, ఏఎన్నార్‌తో అనుబంధం, మొండిగా తీసుకున్న నిర్ణయాలు, రాయలసీమ ప్రజల కోసం జోలె పట్టడం, దివిసీమకు కష్టం వస్తే తల్లడిల్లిపోవడం, కన్న కొడుకు ఆఖరి క్షణాల్లో ఉన్నప్పటికీ నిర్మాతకు నష్టం రాకూడదన్న ఉద్దేశంతో షూటింగ్ అయ్యేంత వరకూ సెట్లో ఉండడం.. ఇలా ప్రతీ విషయాన్నీ అందంగా, హృద్యంగా, చరిత్ర పుస్తకాన్ని తిరగేస్తున్నట్టు చెప్పుకుంటూ వెళ్లాడు క్రిష్. వీటి మధ్య బసవతారకంతో తన అనుబంధానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం బాగుంది. నిజానికి కథానాయకుడిగా ఎన్టీఆర్ ఏమిటన్నది ఆయన అభిమానులకు, సగటు ప్రేక్షకుడికీ బాగా తెలుసు. ఓ భర్తగా, ఇంటి పెద్దగా ఆయనేంటి? తమ్ముడితో తన అనుబంధం ఏమిటి? రామకృష్ణ మశూచీతో చనిపోయినప్పుడు తండ్రిగా ఎన్టీఆర్ పడిన ఆవేదన… ఇవేమీ అంతగా తెలియకపోవొచ్చు. వాటిని కూడా చూపించడంతో ఎన్టీఆర్‌లోని రెండో కోణం అర్థమైంది. ప్రధమార్థం అంతా కథానాయకుడిగా ఎన్టీఆర్ సాగించిన ప్రయాణం కనిపిస్తుంది. దాంతో రకరకాల గెటప్పుల్లో బాలయ్యని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడిగా మారిన బాలయ్యని చూస్తే అభిమానులకు పూనకాలు వస్తాయి. పెద్దాయనతో పోల్చి చెప్పడం కాదుగానీ… కృష్ణుడిగా `ది బెస్ట్` అనిపించాడు బాలయ్య.
ద్వితీయార్థం అంతా రాజకీయ ప్రస్థానానికి లీడ్ గా కనిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనేది సెకండాఫ్ లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్నార్‌కీ తగిన ప్రాధాన్యం ఉంది. అందుకే వారిద్దరి అనుబంధానికి పెద్ద పీట వేశారు. వారి మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పద్మశ్రీ అవార్డు సందర్భంలో `మదరాసీలు` అన్న పదానికి ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పడం, ఎమర్జన్సీలోనూ తన సినిమా విడుదల చేయడానికి ధైర్యం చేయడం.. ఇలాంటి సన్నివేశాలు బాగా వచ్చాయి. దివిసీమ సమయంలో ఎన్టీఆర్ పడిన మానసిన వేదన.. చక్కగా చూపించారు. అక్కడక్కడ.. స్లో గా అనిపించినా…. చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉండడంతో, ఏది పక్కన పెట్టాలో తెలీక అన్నీ చూపించాలన్న తాపత్రయంలో సన్నివేశాలు అల్లుకుపోవడంతో ఆ నెమ్మదిదనాన్ని భరించాల్సివస్తుంది.
నటీనటులు
ఎంత తనయుడైనా.. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోవడం అంత సామాన్యమైన విషయం కాదు. మరో నటుడెవరైనా ఆ సాహజం చేస్తే.. హర్షించేవాళ్లం కాదేమో. బాలయ్య కాబట్టి… అభిమానులకూ పెద్ద ఇబ్బందులు సమస్యలూ ఎదురు కాలేదు. తెరపై చూస్తోంది బాలయ్యని కాదు ఎన్టీఆర్‌ని అనుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ క్రమంగా బాలయ్యలోకి ఎన్టీఆర్ ఆవహిస్తూ వెళ్లిపోయాడు. యుక్త వయసు సన్నివేశాల్లో కాస్త ఇబ్బంది పడ్డాడు గానీ, వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎన్టీఆర్‌ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్లాడు బాలయ్య. ఇన్ని రకాల గెటప్పుల్లో కనిపించే అవకాశం బాలయ్యకు మళ్లీ రాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక విద్యాబాలన్ పాత్ర మరో ఆకర్షణగా నిలిచింది. ఆ పాత్రకు ఓ హుందాతనం వచ్చింది. డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ, బాగా కుదిరింది. నారా చంద్రబాబు నాయుడుగా రానా పాత్ర చివర్లో, అదీ కాసేపే కనిపిస్తుంది. ఏఎన్నార్‌గా సుమంత్… చక్కగా ఒదిగిపోయాడు. రూపు రేఖల్లోనూ అలానే ఉన్నాడు. ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మానందం, రకుల్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఓ ఫ్రేములో కనిపించి.. `ఓహో వీళ్లా?` అని గుర్తించేలోగా కొన్ని పాత్రలు మాయమైపోతుంటాయి. అలాంటి పాత్రలకు కూడా తెలిసిన మొహాలనే తీసుకున్నారు.
సాంకేతిక వర్గం
సాంకేతికంగా ఎన్ని విభాగాలైనా ఉండొచ్చు. కానీ మార్కులన్నీ బుర్రా సాయిమాధవ్‌కే. ప్రతీ సీన్ లోనూ… ఓ మెరుపులాంటి మాటైనా వినిపిస్తుంటుంది.
సినిమాల్లో నిలబడడం ఏమిటయ్యా… సినిమా రంగాన్నే నిలబెడతాడు
సాయానికి కాపాలా ఉండాలా? – కానీ కష్టానికి ఉండాలి.
బాధకు పుట్టిన మనుషులం… బాధ లేకుండా బతకలేం
మీవి సినిమా తుపాకులు కాకపోవొచ్చు. కానీ ఇది సినిమా గుండె. మీ ఫైరింగులకు భయపడదు
మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి.. మనం పోయాకూ తాను గెలిచానని చెప్పుకోవాలి
మన గుండెలు ఆగిపోయినా.. మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి
ఆయన ఏనైనా చెప్పే చేస్తారు. కానీ.. ఏ పనీ అడిగి చేయరు..
– ఇలాంటి డైలాగులు ఎన్నో ఉన్నాయి. కళా విభాగాన్ని ప్రత్యేకించి అభినందించాలి. కీరవాణి నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణ. ఓ రకమైన మూడ్ క్రియేట్ చేయలిగింది ఆ సంగీతంతోనే. ఎన్టీఆర్ జీవిత కథని వెండి తెరపై ఆవిష్కరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దాన్ని క్రిష్ సమర్థవంతంగా పూర్తి చేయగలిగాడు. తన మార్క్ ప్రతీ చోటా చూపించగలిగాడు.
తీర్పు
ఎన్టీఆర్ జీవితం.. ఓ సంబరం. తెలుగు సినిమా చరిత్ర.. ఎన్టీఆర్ చరిత్ర రెండూ ఒక్కటే. ఒకదాన్ని గౌరవించామంటే.. మరో దానికీ ఆ గౌరవం అందుతుంది. అలాంటి సినిమా ఇది. కొన్ని కొన్ని లోపాలు అక్కడక్కడ ఉండొచ్చు. దర్శకుడు ఓ కథలోని పాజిటీవ్ కోణాన్ని మాత్రమే సృశించి ఉండొచ్చు. దాన్నీ అర్థం చేసుకోవాల్సిందే. ఓ గుడికి వెళ్తే.. గర్భగుడిలో మూర్తీభవించిన ఆ మహారూపాన్నే చూడాలి. గుడి వెనుక పారేసిన చెత్త కాదు.
ఫైనల్ టచ్: ఎన్టీఆర్ సినీ ఉత్సవం
తెలుగు360 రేటింగ్: 3/5