‘మహానటి’.. తెలుగులో బయోపిక్ పరంపరకు కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీ ఇచ్చింది. మనకు తెలిసిన సావిత్రి కథనే.. మరో కోణంలో, ఇంకాస్త లోతుగా, హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు. 2018లో వచ్చిన సూపర్ హిట్లలో అదొకటి. అయితే ‘మహానటి’లో ఉండాల్సిన సీన్ ఒకటి.. ‘ఎన్టీఆర్’లో కనిపించింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రినీ చూపించారు. మహానటిలో ఆ పాత్ర కీర్తి సురేష్ చేస్తే.. ఇక్కడ మాత్రం నిత్యమీనన్ నటించింది. కీర్తి ఎంత బాగా కుదిరిందో..నిత్య కూడా అంతే బాగా కుదిరింది. అయితే.. ఓ సన్నివేశం మాత్రం ‘ఇది మహానటిలో ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదా’ అనిపించేలా ఉంది.
సావిత్రి కాస్త దుబారా మనిషి. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు విచ్చల విడిగా ఖర్చు పెట్టింది. చివరి రోజుల్లో సావిత్రి ఆర్థిక పతనానికి ఆ దుబారాతనం కూడా ఓకారణమే. దానికి అద్దం పట్టే సీన్ ఒకటి… ‘ఎన్టీఆర్’లో ఉంది. ఏఎన్నార్ తన ఇంటిని అమ్మాలని చూస్తున్న తరుణంలో సావిత్రి వెళ్లి.. మీ ఇల్లు నేను కొంటాను.. అంటూ బ్లాంక్ చెక్ ఇస్తుంది. ఆ సమయంలో ఏఎన్నార్ చెప్పిన మాటలు సావిత్రికే కాదు, అలాంటి స్వభావం ఉన్న చాలామంది కి సూటిగా తాకుతాయి. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్‌కీ.. ఈసీన్కీ ఏమాత్రం సంబంధం లేదు. దాని తరవాత కంటిన్యుటీ సీన్ లో కూడా ఎన్టీఆర్ సావిత్రికి హితోపదేశం చేస్తాడు. అంతకు మించి ఏఎన్నార్ – సావిత్రి సీన్‌కు ప్రాముఖ్యత లేదు. అదే సీన్ ‘మహానటి’లో కనిపించి ఉంటే ఇంకా బాగుండేది. బహుశా… మహానటిలో ఈ సీన్తెరకెక్కించి ఉంటారు. నిడివి తగ్గించే పనిలో దాన్ని పక్కన పెట్టారేమో అనిపిస్తుంది.